కరోనా కాటుకు…వైద్యుడు, పోలీస్‌ బలి

తెలంగాణ రాజధానిలో కరోనా నృత్యకేళి
రోజు రోజుకు విజృంభిస్తున్న వైరస్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజు కూ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. పరిస్థితి భయానకంగా మారుతోం ది. సామాన్యులనే కాదు, వైద్య సిబ్బందినీ కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు వైద్య సిబ్బందికి కరోనా సోకగా, తాజాగా కరోనాతో ఖైరతాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌(70) మృతి చెందారు. వారం క్రితం జ్వరంతో కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎఎస్‌ఐ (47) కరోనా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 20 రోజుల కిందట కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఎస్‌ఐగా చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన గత వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సామాన్యులతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కరోనా వైరస్‌ కలవర పెడుతోంది. జిహెచ్‌ఎంసిలో కీలక విభాగానికి అధిపతిగా ఉన్న ఒక ఉన్నతాధికారిణికి వైరస్‌ నిర్ధారణ అయింది. కాప్రా సర్కిల్‌లో 8మంది ఎంటమాలాజీ విభాగం, ఎల్‌.బి.నగర్‌లో సెంక్షన్‌ ఆఫీసర్‌కు, ప్రధాన కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు వైరస్‌ సోకడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. పదుల సంఖ్యలో పోలీసులకు కరోనా పాజిటివ్‌గా కావడంతో పోలీస్‌ శాఖలో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సేవలు అందించే వైద్యులు, జిహెచ్‌ఎంసి, పోలీస్‌, జర్నలిస్టులకు ఇలా వరుసగా వైరస్‌కు గురవుతున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించకుండా వస్తువులు కొనుగోలు చేయడం, శానిటైజర్లు ఉపయోగించకపోవడంతో భౌతిక దూరాన్ని పాటించని పరిస్థితులు నగరంలో కనిపిస్తున్నాయి. సరైన జాగ్రత్తలతోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వీలవుతుందంటున్నారు.
ఉస్మానియాలో దారుణం
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చొటు చేసుకుంది. బతికున్న మహిళ చనిపోయిందంటూ ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గత కొంత కాలంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శవ పంచాయితీలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇదే సమయంలో కొత్త తరహా కేసు సోమవారం వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు చికిత్స నిమిత్తం చేరారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒక మహిళ శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతుండగా మరో మహిళ కరోనాతో పోరాడుతుంది. కాగా ఆ ఇద్దరిలో కరోనా సోకిన మహిళ మృతి చెందింది. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది శ్వాస ఇబ్బందులతో చేరిన మహిళ చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి ఎలా చనిపోయిందని బాధితురాలి కూతరు నిలదీసింది. తన తల్లి చనిపోలేదని, వేరే మహిళ చనిపోయిందని తెలుసుకున్న వారు తప్పుడు సమాచారం ఇచ్చి భయబ్రాంతులకు గురిచేశారని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు నెగెటివ్‌…
గోషామహాల్‌ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ లోదా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. రాజాసింగ్‌ కుటుంబం హోం క్వారంటైన్‌ అయింది. దీంతో రాజాసింగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చింది. దీంతో రాజాసింగ్‌ కుటుంబ సభ్యులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా రాజాసింగ్‌ స్పదింస్తూ శ్రీరాముడు, గోమాత దయతో తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిందన్నారు. తన క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?