కరోనా కట్టడి అవుతున్నట్టా? లేనట్టా?

రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలపై వ్యక్తమవుతున్న ఆందోళన
నిర్మల్‌లో కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షల సడలింపు
14 రోజులుగా నమోదు కాని కేసులు
కరీంనగర్‌లో కంటైన్మెంట్‌ జోన్ల తగ్గింపు
జనగామలో 8 మందిని క్వారంటైన్‌కు తరలింపు
సూర్యాపేట, వికారాబాద్‌లలో నమోదు కాని కొత్త కేసులు
మంచిర్యాల, నారాయణపేట జిల్లాల్లో లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్‌ ఫార్మూలా
ప్రజాపక్షం/హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా తెలంగాణలో కాస్తా శాంతిస్తోందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా కట్టడి అవుతోందా అంటే రెండు, మూడు రోజులుగా నమోదవుతున్న కేసులతో.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం 15, గురువారం 27 కొత్త పాజిటివ్‌ కేసులు, శుక్రవారం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఒక్కరోజు 56 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలను బట్టి రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినట్లే అనిపిస్తున్నప్పటిటీ ఇది తగ్గుముఖం పట్టిందనడానికి సంకేతంగా తీసుకోవద్దని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కారణం దేశంలోనే మన రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయి. ఉదాహరణకు పరిశీలిస్తే సూర్యాపేటలో గత మూడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. నిజానికి ఈ జిల్లా రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ జిల్లాలో గత మూడు రోజులుగా ఒక్క నమూనా కూడా పరీక్షించలేదు. ఇలాంటి జిల్లానే అయిన వికారాబాద్‌లోనూ గత మూడు రోజులుగా ఒక్క నమూనాను కూడా పరీక్షించలేదు. దీంతో ఇక్కడ కూడా గత మూడు రోజులుగా పాజిటివ్‌ కేసులు లేవు. అలాగే గద్వాల జిల్లాల్లో శుక్రవారం ఒక్క నమూనా కూడా పరీక్షంచకపోవడంతో ఇక్కడ ఒక్క కేసు కూడా కొత్తగా రాలేదు. తగ్గుముఖం పట్టడం లేదు అనడానికి సంకేతాలు కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో తాజాగా ఎలాంటి లక్షణాలు లేకున్నప్పటికి ముగ్గురికి కరోనా పాజిటివ్‌ తేలింది. తగ్గుముఖం పట్టింది అనడానికి కూడా కొన్ని సంకేతాలు జారీ అయ్యాయి. కరోనా పాజిటివ్‌ కేసులతో అట్టుడికిన నిర్మల్‌ జిల్లాలో గత 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ జిల్లాలోని 8 కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలను సడలించారు. వీటిలో హైరిస్క్‌ ప్రాంతాలైన గాజులపేట, రాచాపూర్‌, రాయదారి, కడెం, జోహ్రానగర్‌లు కూడా ఉన్నాయి. మర్కజ్‌ వ్యవహారం తొలుత వెలుగు చూసిన కరీంనగర్‌లోనూ తాజాగా కాంటైన్మెంట్‌ జోన్లను తగ్గించారు. అయితే లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా బెడసి కొడతాయని, ఆ నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదనే అభిప్రాయాలు కూడా వైద్య వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల సెకండరీ కాంటాక్ట్‌, లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ వస్తున్న కేసులు కొత్తగా వస్తున్న తరుణంలో సెకండరీ కాంటాక్ట్‌ వారికి రక్తనమూనాల పరీక్షలు చేయవద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదంటున్నారు. కరోనా రక్త నమూనాల పరీక్షల విషయంలో మన రాష్ట్రం దేశంలో ఏడవ స్థానంలో ఉంది. ఇలాంటి సెకండరీ కాంటాక్ట్‌ వారికి నమూనాల పరీక్షలు చేయకుంటే మరింత మందికి కరోనా వ్యాప్తి చెందుతుందంటున్నారు. దీనికి తోడు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షల సడలింపు వంటిది కూడా బెడిసి కొట్టే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?