‘కరెంటు’పై కనికరం లేదా..?

లాజిక్కులతోనే సమాధానం
‘స్లాబు’లంటూ ప్రభుత్వం సమర్థన
విద్యుత్‌ సంస్థల ఖజానా పెంచేందుకే మొగ్గు
ఎంఎల్‌ఎలే తట్టుకోకపోతే సామాన్యుల పరిస్థితేంటి?
ప్రజాపక్షం/హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలంలో పేద, మధ్య తరగతివారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ‘కరెంటు’ కనికరం చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మూడు నెలల రీడింగ్‌లను మూడుతో భాగించి స్లాబుల వారీగా బిల్లులు వసూలు చేస్తున్నామని, ఎవ్వరికీ నష్టం లేదని లాజిక్కులతో ప్రభుత్వం సమాధానం చెబుతోంది. ఒకవైపు విద్యుత్‌ బిల్లుల విషయంలో ఉపశమనం ఇవ్వాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఖజానాను నింపుకునేందుకే మొగ్గు చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక పేద, మధ్య తరగతి వారు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే తమ రోజు వారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. ఇంకా పూర్తిగా పరిస్థితులు సద్దుమణగలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామన్యులకు ఏదో ఒక రూపంలో రాయితీలు, ఆర్థిక సహకారంతో అండగా నిలువాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా బిల్లుల పేరుతో భారం మోపుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కిరాయిలు కూడా అడగొద్దని, జీతాలు పూర్తిగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తమ విషయం వచ్చే సరికే సామాన్యుల ముక్కుపిండి మరీ బిల్లులను వసూలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఒకవేళ పూర్తి బిల్లులు చెల్లించడం సాధ్యం కాకపోతే వడ్డీతో వాయిదాల పద్దతిన చెల్లించాలని విద్యుత్‌ సంస్థలు ‘వడ్డీ’ వ్యాపారాన్ని మొదలు పెట్టాయని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం రూ.18వేల బిల్లుకే ఒక టిఆర్‌ఎస్‌కు చెందిన ఎంఎల్‌ఎ లబోదిబోమంటూ విద్యుత్‌ శాఖ మంత్రి వద్దకు వెళ్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాగే మరో విద్యుత్‌ శాఖ కార్యదర్శి కూడా రూ. 24 వేల బిల్లు వస్తే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్టు రీడింగ్‌ను మూడు నెలలతో భాగించి స్లాబుల వారీగా లెక్కిస్తున్నామని సమర్ధించుకుంటుంది. సాధారణంగా ఒక్కో నెలలో ఒక్కో రకంగా రీడింగ్‌ హెచ్చతగ్గులు తగ్గవచ్చు. మూడు నెలల రీడింగ్‌ను ఒకేసారి లెక్కించడం లేదంటూ సామన్యులకు ఇదే పెద్ద మెహర్‌బానీగా విద్యుత్‌ శాఖ సమర్ధించుకుంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యు త్‌ బిల్లుల విషయంలో ప్రత్యేకంగా ఒకటి, రెండు స్లాబులు, వాయిదాల పద్ధతికి అవకాశం కలిపంచినా కొంత వరకు మేలు చేసేదనే అభిప్రాయాలు లేకపోలేదు.

ఒక్క పైసాఎక్కువ లేదు

కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు
విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ వినియోగదారులు వినియోగించిన బిల్లులకు మాత్రమే విద్యుత్‌ బిల్లుల వసూలు చేస్తున్నామని, అంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ వచ్చే అవకాశమే లేదని విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడు నెలల్లో ఎంత వినియోగిస్తే అంతే బిల్లు వస్తుందని, ఎవ్వరికీ నష్టం రాదని, మూడు నెలల రీడింగ్‌ను ఒకే స్లాబ్‌ కింద లెక్కించడం లేదని, ఎవ్వరూ అనుమానాలు, ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌- నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉన్నారని, తద్వారా విద్యుత్‌ వాడకం పెరిగిందని, ప్రతి వేసవి సమయానికి 35 శాతం వరకు డిమాండ్‌ పెరుగుతందని, ఈసారి అదనంగా మరో 15 నుండి 20 శాతం పెరిగిందని వివరించారు. హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ -19 నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలన్నీ పూర్తి స్థాయిలో నిమగ్నమై పని చేశాయని, ఒక వైపు వైద్య సిబ్బంది, మరో రెండు శాఖలు ప్రజలకు సేవలను అందించాయన్నా రు. విద్యుత్‌ శాఖలో లైన్‌ మెన్‌ నుండి సబ్‌ స్టేషన్‌, అధికారులు అందరూ రాత్రి బంవళ్లు పని చేశారని, అరగంట కూడా కరెంటు పోకుండా చూశారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బిల్లు రీడింగ్‌కు ఎవ్వరూ వెళ్లలేదన్నారు. బిల్లులు చెల్లించకపోతే సంస్థలు నడపడం కష్టమని , దేశ వ్యాప్తంగా ఇఆర్‌సి రెండు,మూడు పద్ధతులను పాటించాయని, ఇక్కడ మన ఇఆర్‌సి గత ఏప్రిల్‌, మే నెలలో ఇచ్చిన బిల్లులనే చెల్లించాలని ఆర్డర్‌ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం వినియోగదారులు బిల్లులను చెల్లించారన్నారు. మూడు నెలల తర్వాత రీడింగ్‌ లెక్కించినప్పుడు స్లాబ్‌ పెరుగుతుందని వినియో గదారుల నుండి ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమమయ్యాయని వివరించారు. మూడు నెలలకు రీడింగ్‌ను మూడతో బాగించి ఆ లెక్కల ప్రకారమే బిల్లులను వేస్తున్నామని తెలిపారు. డోమెస్టిక్‌ కేటగిరీ 1ఎ ,1బి-1, 1బి-2 కేటగిరీలు ఉన్నాయని, వినియోగించిన రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు వస్తాయని, ఇదంతా కంప్యూటర్‌లోనే ఫీడ్‌ అయి ఉన్నదని తెలిపారు. వినియోగదారులు ఏ కేటగిరీ, ఏ స్లాబ్‌ పరిధిలోకి వస్తారో ప్రతి యూనిట్‌కు లెక్క గట్టి బిల్లులు ఇస్తున్నామన్నారు.
ఉదాహరణలతో సహా వివరించిన మంత్రి : స్లాబ్‌లో భాగంగా మూడు నెలలలో 153 యూనిట్లగాట్లు 51 యూనిట్ల చొప్పున 1:45 పైసల చొప్పున, మిగిలిన రీడింగ్‌ను మరో స్లాబ్‌ చొప్పునా అలాగే, 1బి-2 వినియోగదారునికి 704 యూనిట్లు వస్తే సాలీన 235 యూనిట్లుగా గుర్తించి 200 వరకు రూ. 5ల చొప్పున రూ.3వేలు, 201 నుండి 300ల రీడింగ్‌కు రూ.7ః 20 పైసల చొప్పున లెక్కించి మొత్తంగా రూ.3971 బిల్లు వచ్చిందన్నారు. గత ఏప్రిల్‌లో రూ. 1416 బిల్లు ఉండేదని, దీనిని చెల్లించడంతో దానిని తీసివేసి బిల్లు వసూలు చేస్తున్నామని వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?