కణితితో పాటు కిడ్నీ లేపేసిన డాక్టర్లు

మలక్‌పేట యశోద ఆసుపత్రిలో దారుణం
రోగి పరిస్థితి విషమం, పోలీసులకు ఫిర్యాదు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: కడుపులో కణితి తొలగిస్తామని చెప్పి.. తెలియకుండానే కిడ్నీని కూడా మాయం చేసిన మలక్‌పేట యశోద ఆసుపత్రి నిర్వాకం మంగళవారం వెలుగు చూసింది. ఈ మేరకు రోగి కుటుంబ సభ్యులు ఛాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌లో సదరు డాక్టర్లపై ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హయత్‌నగర్‌ మండలం తా రామతిపేటకు చెందిన శివప్రసాద్‌ (29) కడుపునొప్పితో ఏడు రోజుల క్రితం మలక్‌పేట ఆసుపత్రి లో చేరాడు. అతడికి కడుపులో కణితి (గడ్డ) అయిందని, దాన్ని తొలగించేందుకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు చెల్లించారు. సోమవా రం శివప్రసాద్‌కు యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్‌ నిర్వహించి కడుపులో కణితి తొలగించారు. మంగళవారం రోగి పరిస్థితి మరిం త క్షీణించడంతో అనుమానం వచ్చిన కు టుంబ సభ్యులు డాక్టర్లను నిలదీశారు. సోమవారం జరిగిన ఆపరేషన్‌లో కడుపులో కణితి తో పాటు కిడ్నీని సైతం తొలగించామని చెప్పడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. కడుపులో కణితి తొలగిస్తామని చెప్పి కిడ్నీ ఎలా తొలగిస్తారని డాక్టర్లతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిడ్నీ సమస్య ఉందని తమకు ఇంత వరకు డాక్టర్లు చెప్పలేదని, కిడ్నీ సమస్య నిజంగానే ఉంటే ఆసుపత్రిలో చేరిన తరువాత తమకు చెప్పాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందని, అయితే తమకు మాత్రం కిడ్నీ గురించి ఏ మాత్రం చెప్పకుండా కిడ్నీ తీసేశామని చెప్పడం ఎంత వరకు సమంజసమని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి శివప్రసాద్‌కు కిడ్నీ సమస్య లేదని, కడుపులో కణితి సమస్య మాత్రమే ఉందని, డాక్టర్ల పొరపాటు వల్లనే వారు కిడ్నీ తొలగించారని వారు ఆరోపించారు. ఆరోగ్యకరంగా ఉన్న కిడ్నీని తొలగించిన యశోద ఆసుపత్రి డాక్టర్లు, యాజమన్యాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు చాధర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివప్రసాద్‌కు కడుపులో కణితి, కిడ్నీ ఈ రెండు ఒకేసారి ఎలా చెడిపోతాయని ఒకవేళ్ల నిజంగా కిడ్నీ సమస్య ఉంటే డాక్టర్లు తమకు ముందే ఎందుకు వెళ్లడించలేదని వారు ఆరోపించారు. కిడ్నీ తొలగించాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి అని వారు గుర్తు చేశారు. అపరేషన్‌కు ముందు కిడ్నీకి సంబంధించిన ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని వారు గుర్తు చేశారు. శివప్రసాద్‌ కిడ్నీని తొలగిస్తే ఆ కిడ్నీని తమకు ఎందుకు చూపించలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో డాక్టర్లు పొరపాటు చేసినట్లు తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్‌ మరోకరికి చేసి శివకుమార్‌కు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మరోపక్క శివప్రసాద్‌ ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించింది.

DO YOU LIKE THIS ARTICLE?