ఓడినా సిరీస్‌ విండీస్‌కే..

చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం
2-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న కరీబియన్లు
గ్రాస్‌ ఐలెట్‌: వరుస విజయాలతో జోరుమీదున్న వెస్టిండీస్‌కు చివరి టెస్టులో మాత్రం భారీ ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విండీస్‌ వరుసగా రెండు విజయాలు సాధించి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లాండ్‌ అద్భుతంగా పోరాడి 232 పరుగులతో కరీబియన్‌ జట్టును చిత్తు చేసింది. ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యా టింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో పుంజుకుని ఘన విజయం సాధించింది. ఇక విండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2 కైవసం చేసుకుంది. 485 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ జట్టు 69.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లాండ్‌కు భారీ విజయం దక్కింది. కరీబియన్‌ జట్టులో రొస్టన్‌ చేజ్‌ (102 నాటౌట్‌; 191 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంట రి పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. చివర్లో జోసెఫ్‌ (30 బంతుల్లో 34), కీమ ర్‌ రోజ్‌ (29) పర్వాలేదనిపించారు. ఒక సమయంలో 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను చేజ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. సహచరులతో చిన్నపాటి భాగస్వామ్యాలు ఏర్పర్చుతూ స్కోరుబోర్డును చివరికి 250 పరుగులు దాటించాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు తెలివిగా బౌలింగ్‌ చేస్తూ వరు స విరామాల్లో వికెట్లు తీస్తూ తమ జట్టు పరువు కాపాడారు. బ్యాట్స్‌మెన్స్‌ కూడా రాణించడంతో ఇంగ్లాండ్‌ క్లీన్‌ స్వీప్‌ గండం నుంచి బయటపడింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేయగా.. బదులుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 154 పరుగులకే కుప్పకూలింది. మార్క్‌ వూడ్‌ 5 వికెట్లతో విజృంభించగా.. మోయిన్‌ అలీ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌ జోయ్‌ రూట్‌ (122) అద్భుతమైన శతకంతో చెలరేగాడు. దీంతో ఇంగ్లాండ్‌ 361/5 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. విండీస్‌ ముందు 485 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కరీబియన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 252 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జెమ్స్‌ అండర్సన్‌, మోయిన్‌ అలీ చెరో మూడు వికెట్లు తీయగా.. బెన్‌ స్టోక్స్‌ రెండు వికెట్లు పడగొట్టి ఆతిథ్య విండీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో తనవంతు సహకారం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించిన మార్క్‌ వూడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ టోర్నీ అవార్డును కీమర్‌ రోచ్‌ సొంతం చేసుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?