ఓటమిపై స్కానింగ్‌

కాంగ్రెస్‌ ఓటమి, టిఆర్‌ఎస్‌ గెలుపుపై సమీక్ష
ఇవిఎంల ట్యాంపరింగ్‌, అధికార దుర్వినియోగంతోనే టిఆర్‌ఎస్‌ గెలిచిందని తేల్చిన కోర్‌ కమిటీ
గులాబీ పార్టీకి సహకరించిన అధికారులు, ఇసిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

ప్రజా పక్షం/హైదరాబాద్‌ : శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్‌ పార్టీ పోస్ట్‌మార్టం మొదలు పెట్టింది. కాంగ్రెస్‌ ఓటమి, టిఆర్‌ఎస్‌ విజయానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో సమీక్షించింది. ఇవిఎంల ట్యాంపరింగ్‌, అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ, ఎన్నికల అధికారులను తమ నియంత్రణతో టిఆర్‌ఎస్‌ అడ్డదారిలో విజయం సాధించిందని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ తెలిపింది. ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, ఎన్నికల కమి షన్‌, పోలీసు అధికారులపై త్వరలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే రాబోయే పంచాయతీ, లోక్‌ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని హోటల్‌ గోల్కోండలో సోమవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.సి. కుంటియా అధ్యక్షతన కోర్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమీక్షలో పిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , ఎఐసిసి కార్యదర్శి సలీమ్‌ అహ్మద్‌, ఎంఎల్‌సి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు, మాజీ ఎంఎల్‌ఎలు దామోదర రాజనర్సింహ, పద్మావతిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దామోదర్‌ రెడ్డి, పోటీ చేసిన అభ్యర్థులు అద్దంకి దయాకర్‌, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమికి అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. పోలింగ్‌ పర్సంటేజీ, కౌంటింగ్‌ పర్సంటేజీకి ఎందుకు తేడా వచ్చిందో ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రజాకూటమి ఏర్పాటు నుంచి మొదలు ఎన్నికలు ఫలితాల వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్‌ నేతల పనితీరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే పార్లమెంట్‌, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పోటీ చేసిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జుగా వ్యవహరించనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?