ఒయు భూముల ఆక్రమణ సర్కార్‌కు పట్టదా?

వర్సిటీ భూములకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆక్రమణ ప్రాంతాల్లో పర్యటించిన అఖిలపక్ష నేతలు
ప్రజాపక్షం/హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించా యి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యభూమిక పోషించిన ఒయు భూములకే రక్షణ లేకపోవడం ప్రభుత్వ పని తీరకు నిదర్శనమని ఎద్దేవా చేశా యి. ఒయు భూముల ఆక్రమణ అంశాన్ని గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాయి. హైదరాబాద్‌లోని డిడి కాలనీకి అనుకొని ఉన్న ఒయు భూములను ప్రతిపక్ష పార్టీల నేతలు మం గళవారం సందర్శించారు. రిటైర్డ్‌ జస్టిస్‌ లింగాల నర్సింహారెడ్డి కుటుంబం నిర్మాణాలు చేపడుతున్న స్థలాన్ని వారు పరిశీలించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌పాషా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ డి. సుధాకర్‌, గిరిజన సమా ఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్‌, టిజెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, సిపిఐ(ఎం.ఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్దన్‌, అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, సిపిఐ(ఎం.ఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రమాదేవి, ఎస్‌.ఎల్‌. పద్మ, సిపిఐ ఎం.ఎల్‌- న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రసాద్‌తో పాటు ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు పాలడుగు శ్రీనివాస్‌, శంకర్‌, దుబ్బ రంజిత్‌, రమ్య, రాము, విజెఎస్‌ నాయకులు నిజ్జన రమేష్‌ ముదిరాజ్‌, ఒయు భూములను సందర్శించిన వారిలో ఉన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయానికి పెద్దపీట వేస్తున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆక్రమణకు గురైన ఉస్మానియా విశ్వవిద్యాలయాల భూములను రక్షించాలని, ఒయు చుట్టూ ప్రహరిగోడను నిర్మించి, ఒయు భూముల రక్షణ చర్యలకు రూ. 200 కోట్లు విదుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భూములు కబ్జా అవుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం మంచిది కాదన్నారు. ఒయు భముల అంశంపై భవిష్యత్‌ కార్యాచరనను ప్రకటిస్తామన్నారు.
జీవగంజి పోసిన ఒయుపైనే కెసిఆర్‌ నిర్లక్ష్యం -: చాడ వెంకట్‌ రెడ్డి
కెసిఆర్‌కు జీవగంజి పోసిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆయన అధికారంలోనికి వచ్చిన తర్వాత మర్చిపోయారని, నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఉస్మానియాలో కనీస మౌలిక వసతులు లేవని, విసి లేరని ఆరోపించారు ఒయును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సిఎం కెసిఆర్‌పై ఉన్నదని, ఇది ఆయన కర్తవ్యమని డిమాండ్‌ చేశారు. ఒయు త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీకి వైస్‌ఛాన్సలరే లేరని, ఒయులో విద్యను వదిలి పరిపానలను పట్టించుకోకపోవడంతోనే భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. ఒయు స్థలానికి సంబంధించి పాత లింకు డాంక్యుమెంట్లను సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కబ్జా వెనకాల ఎవరి అండ ఉన్నది.. ఎవరి హస్తం ఉన్నదో అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అసలు ప్రతిపక్షాలు ఎక్కడున్నాయని సిఎం హేళన చేస్తున్నారని, సమస్యను ఎత్తిచూపిస్తే పట్టించుకునే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల భూములను వదులుకుంటూ, ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విమర్శించారు. ఒయుకు చెందిన భూములు అన్యాక్రాంతమైనా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వం పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు. భూములు కబ్జా జరుగుతున్నప్పటికీ అతీగతీ లేకుండా పోయిందని పేర్కాన్నారు.
విశ్వవిద్యాలయాల పరిరక్షణపై సర్కార్‌ నిర్లక్ష్యం: కోదండరామ్‌
ఒక వైపు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆర్డినెన్స్‌ జారీ చేయడం అదే రోజు ప్రభుత్వ భూములు కబ్జాకు గురికావడం విద్యపట్ల ప్రభుత్వ విధానాన్ని బహిర్గతం చేస్తుందని టిజెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ అన్నారు. విశ్వవిద్యాలయాల పరిరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంచి రోజులు వస్తాయని, నిధులు, మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తే.. ఉన్న సౌకర్యాలు లేకపోగా విసిని కూడా నియమించలేదని, భూముల కబ్జా జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు పాలకమండలి లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతవిద్య పాలసీని ప్రకటించాలని, విశ్వవిద్యాలయాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఐ (ఎం.ఎల్‌ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్దన్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ భూముల కబ్జాకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు.

DO YOU LIKE THIS ARTICLE?