ఒక్క రోజే పదివేల కేసులు!

కరోనా కేసుల్లో స్పెయిన్‌నూ అధిగమించిన ఇండియా
వైరస్‌ అధికంగా ఉన్న దేశాల జాబితాలో 5వ స్థానంలోకి..
కొత్తగా 9,971 కేసులు, 287 మరణాలు
2,46,628కు చేరుకున్న పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజు రోజు కు గరిష్టస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. వరుసగా ఐదు రోజుల నుంచి 9 వేలకు పైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. ఒక్క రోజే అత్యధికంగా దాదాపు 10 వేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్‌లో కొవిడ్‌ బయటపడిన తరువాత 24 గంటల్లో 9,971 కేసులు బయట పడడం ఇదే తొలిసారి. దీంతో ఆదివారం ఉదయం నాడికి కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,46,628కి ఎగబాకినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 287 మంది మృత్యువాత పడ్డారు. వీరితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 6,929కి చేరింది. ప్రస్తుతం 1,20,406 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,19,292 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. 24 గంట ల్లో మొత్తం 5,220 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 48.37గా ఉన్న ట్లు మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తాజా కేసులతో కొవిడ్‌- తీవ్రత అధికంగా ఉన్న స్పెయిన్‌ను దాటి భారత్‌ 5వ స్థానానికి చేరినట్లు జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యుకె తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీనికి ఒకరోజు క్రితమే కేసుల సంఖ్యలో భారత్‌ ఇటలీని కూడా దాటివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదాపు 2లక్షల 86వేల కేసులతో యుకె నాల్గో స్థానంలో ఉండగా.. 2 లక్షల 41వేల కేసులతో స్పెయిన్‌ ఆరో స్థానం లో కొనసాగుతున్నాయి. కరోనా మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో 12స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడా 7850 మరణాలతో 11స్థానంలో ఉండగా.. దాదాపు 6వేల మరణాలతో నెదర్లాండ్‌ 13స్థానంలో కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి మహారాష్ట్రలో కొత్తగా 120 మంది మరణించగా, ఢిల్లీలో 53, గుజరాత్‌లో 29, తమిళనాడులో 19 మంది, పశ్చిమ బెంగాల్‌లో 17, మధ్యప్రదేశ్‌లో 15 మంది, రాజస్థాన్‌లో 13 మంది, తెలంగాణలో 10 మంది, జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు, కర్నాటక, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు చొప్పున, కేరళ, బీహార్‌లో ఒకరకు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 2,969 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గుజరాత్‌లో 1,219, ఢిల్లీలో 761, మధ్యప్రదేశ్‌లో 399, పశ్చిమ బెంగాల్‌లో 393, ఉత్తరప్రదేశ్‌లో 257, తమిళనాడులో 251, రాజస్థాన్‌లో 231, తెలంగాణలో 123, ఆంధ్రప్రదేశ్‌లో 73, కర్నాటకలో 59, పంజాబ్‌లో 50, జమ్మూకశ్మీర్‌లో 39, బీహార్‌లో 30 మంది, హర్యానాలో 24, కేరళలో 15 మంది, ఉత్తరాఖండ్‌లో 11 మంది, ఒడిశాలో 8 మంది, జార్ఖండ్‌లో ఏడుగురు, హిమాచల్‌, చండీగఢ్‌ ఐదుగురు చొప్పున, అసోం, ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు చొప్పున, మేఘాలయ, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 82,968 కేసులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో కొనసాగుతుంది. తమిళనాడులో 30,152 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 27,654, గుజరాత్‌లో 19,592, రాజస్థాన్‌లో 10,331, ఉత్తరప్రదేశ్‌లో 9,733, మధ్యప్రదేశ్‌లో 9,228, పశ్చిమ బెంగాల్‌లో 7,738, కర్నాటకలో 5,213, బీహార్‌లో 4,915, ఆంధ్రప్రదేశ్‌లో 4,510, హర్యానాలో 3,952, తెలంగాణలో 3,496, జమ్మూకశ్మీర్‌లో 3,467, ఒడిశాలో 2,781, పంజాబ్‌లో 2,515, అసోంలో 2,397, కేరళలో 1,807, ఉత్తరాఖండ్‌లో 1,303, జార్ఖండ్‌లో 1000, ఛత్తీస్‌గఢ్‌లో 923, త్రిపురలో 747 మందికి కరోనా సోకింది. అదే విధంగా హిమాచల్‌లో 400 మంది కొవిడ్‌ 19 బారిన పడ్డారు. చండీగఢ్‌లో 309, గోవాలో 267, మణిపూర్‌లో 157, నాగాలాండ్‌లో 107, పుదుచ్చేరి, లడఖ్‌లో 99 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక అరుణాచల్‌లో 47, అండమాన్‌ నికోబార్‌, మేఘాలయలో 33 కేసులు, మిజోరాంలో 24, దాదర్‌ నగర్‌ హవేలీలో 19, సిక్కింలో ఏడు కేసులు నమోదయ్యాయి. మరో 8,605 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.
పరీక్షల సామర్థ్యాన్ని పెంచిన ఐసిఎంఆర్‌
వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో కరోనాను గుర్తించేందుకు పరీక్ష సామర్థ్యాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్‌) పెంచింది. ప్రభుత్వ ల్యాబ్‌ల సంఖ్యను 531కి పెంచగా, 228 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. మొత్తం కలిపి 759 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో దాదాపు 1,42,069 నమూనాలను పరీక్ష చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 46,66,386 పరీక్షలు చేశారు.
అదుపులో మరణాల రేటు
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైనా భారత్‌లో అతితక్కువగా కొవిడ్‌- కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ప్రతి లక్ష మంది జనాభాలో కేవలం 0.49 కరోనా మరణాలు సంభవిస్తుండగా, ప్రతి లక్ష మంది జనాభాలో అత్యల్పంగా 17.32 వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల విషయంలో ప్రపంచంలోనే ఐదవ దేశంగా భారత్‌ నిలిచినా లక్ష మంది జనాభాలో ఇన్ఫెక్షన్‌ రేటు, మరణాల సంఖ్యలో మాత్రం పలు దేశాల కంటే చాలా మెరుగ్గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. డబ్ల్యుహెచ్‌ఒ గణాంకాల ప్రకారం జర్మనీలో ప్రతి లక్ష జనాభాకూ 219 కరోనా వైరస్‌ కేసులు నమోదవుతుండగా, ఇటలీలో 387, బ్రిటన్‌లో 419, స్పెయిన్‌లో 515 కేసులు నమోదవుతున్నాయి. ఇక లక్ష జనాభాకు బ్రిటన్‌లో 59 కొవిడ్‌- మరణాలు చోటుచేసుకోగా, స్పెయిన్‌లో 58, ఇటలీలో 55, జర్మనీలో 10 మంది చొప్పున కోవిడ్‌-19తో మృత్యవాతన పడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?