ఒక్క మెతుకు చాలు!

ఖర్చుకు తగ్గించుకునేందుకు తక్కువ ఆహారాన్ని తీసుకుంటున్న 74 శాతం మంది ప్రజలు
67శాతం మంది ఉపాధికి గండి!
పని ఉన్నా 63 శాతం మంది ఆదాయం కోల్పోతున్న వైనం
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ తాజా సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: “ఆదాయం లేదు…పనిలేదు…ఏం కొనేటట్టు లేదు…చేతిలో అన్నం మెతుకులు ఉన్నా ఏం తినేటట్టు లేదు…ఒక పూట ఖాళీ కడుపుతో ఉండి, ఒక్క పూటే తిందాం…లేదా ఖర్చు తగ్గించుకొని కొద్దికొద్దిగా తిని సరిపెట్టుకుం దాం…రేపటి పని సంగతేంటో, రేపటి ఆదాయం సంగతేంటో, రేపటి కరోనా సంగతేంటో…” మన దేశంలో దాదాపు 75 శాతం మంది ప్రజల దయనీయ పరిస్థితి ఇది. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ అమలు కారణంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రజల పరిస్థితి అస్తవ్యస్థమైంది. జనం ఉపాధికి ఎనలేని గండిపడింది. మూడు దశల లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు 67శాతం మంది ఉపాధి కోల్పోయినట్లు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ఎంప్లాయిమెంట్‌ (సిఎస్‌ఇ) విభాగం చేపట్టిన శాంపిల్‌ సర్వే వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మరో పది రాష్ట్రాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. కొందరికి పని లభిస్తున్నప్పటికీ వారిలో 63శాతం మంది తమ ఆదాయా న్ని కోల్పోతున్నారని పేర్కొంది. లాక్‌డౌన్‌ ప్రభావం ప్రజల జీవనంపై ఏవిధంగా ఉందన్న విషయంపై సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 74శాతం మంది ఖర్చులు తగ్గించుకోవడం కోసం తాము గతంలో కంటే తక్కువ ఆహారాన్ని తింటున్నట్లు వెల్లడించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. వీరిలో 80శాతం పట్టణ ప్రాంతాల్లో, 70శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని సర్వే స్పష్టం చేసింది. కనీసం వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు కొనడానికి తమ దగ్గర డబ్బు లేదని సర్వేలో పాల్గొన్న 49శాతం మంది వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఉపాధి కోల్పోగా..గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగురు ఉపాధి కోల్పోతున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా పట్టణాల్లోని స్వయం ఉపాధి కార్మికుల్లో దాదాపు 84శాతం మంది ఉపాధి కోల్పోయారు. కాగా 76శాతం మంది నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, 81శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు కూడా వారి ఉపాధి కోల్పోయినట్లు సర్వే పేర్కొంది. వ్యవసాయేతర స్వయంఉపాధి పొందుతున్న వారిలో దాదాపు 90శాతం మంది సరాసరి వారం ఆదాయం రూ.2240 నుంచి రూ.218కి పడిపోయినట్లు సర్వే తెలిపింది. తాత్కాలిక ఉద్యోగుల్లో ఫిబ్రవరిలో రూ.940గా ఉన్న వారం ఆదాయం లాక్‌డౌన్‌ సమయంలో రూ.495కి తగ్గిందని స్పష్టంచేసింది. ఇక నెలవారి జీతం తీసుకునే కార్మికుల్లో దాదాపు 51శాతం మంది జీతాల్లో కోత ఉండగా మరికొందరికి జీతమే రాలేదని సర్వే పేర్కొంది. అయితే, దాదాపు 86శాతం మంది ప్రభుత్వం అందించిన రేషన్‌ సరుకులను పొందినట్లు వెల్లడించారు. కొందరు కేంద్రం ఇచ్చిన డబ్బులు పొందగా.. జన్‌ధన్‌ ఖాతా లేని కారణంగా మరికొందరికి డబ్బు అందలేదని తెలిపారు. ఏప్రిల్‌ 13 నుంచి మే 9 వరకు జరిపిన ఈ సర్వేలో 12 రాష్ట్రాల్లోని దాదాపు 4వేల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న అసంఘటిత రంగానికి చెందిన వారినుంచే ఈ అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా నెలకు 10వేల కంటే తక్కువ సంపాదన కలిగిన వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. స్థానిక ప్రజా సంఘాల సహకారంతో సమాజంలోని అట్టడుగు వర్గాల అభిప్రాయాలను ఈ సర్వేలో పొందుపరిచినట్లు నిర్వహకులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు వారి ఉపాధి, కుటుంబంపై ప్రభావం, ప్రభుత్వ సహకారం వంటి అంశాలతో ఈ సర్వే నిర్వహించారు. ఇదిలావుండగా, లాక్‌డౌన్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నెలలోనే దాదాపు 12 కోట్ల ఉద్యోగాలు పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా మే మొదటి వారానికి దేశంలో నిరుద్యోగం రేటు 27.1శాతానికి చేరిందని అంచనా వేసింది. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలపై లాక్‌డౌన్‌ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు సీఎంఐఈ అభిప్రాయపడింది.

DO YOU LIKE THIS ARTICLE?