ఒకే అపార్ట్‌మెంట్‌లో 23 కేసులు

హైదరాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా
కొత్త ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్న కేసులు
11 నెలల పసికందుతో పాటు ఓ గర్భిణికి సోకిన వైరస్‌
తాజాగా రాష్ట్రంలో 55 మందికి కరోనా

ప్రజాపక్షం/హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో కరోనా వైరస్‌ విజృభిస్తోంది. ప్రతిరోజు నగరంలో ఏదో ఒకచోట కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలికాలంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కొత్త కొత్త ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారవర్గాలు కలవరానికి గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ మాదన్నపేటలో 23 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మాదన్నపేటలో కలకలం రేగింది. రాష్ట్రంలో శనివారం 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిహెహెచ్‌ఎంసిలో అత్యధికంగా 44 కేసులు, రంగారెడ్డి జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోని మాదన్నపేటలో ఒక అపార్ట్‌మెంట్‌లోనే 23 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరితో సంబంధం ఉన్న మరో ఐదుగురికి పాజిటివ్‌గా వచ్చింది. మొత్తం 50 మందికి పరీక్షలు చేయగా 28 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే వీరిలో 11 నెలల పసికందుతో పాటు ఓ గర్బిణి స్త్రీ కూడా ఉన్నట్లు తెలిసింది. మరో ఐదుగురికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఒకేసారి భారీ కేసులు నమోదుకావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మాదన్నపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేలకుపైగా నర్సులతో స్క్రీనింగ్‌, ఫీవర్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకులు నిర్వహించడంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌ కేసులు నిర్ధ్థారణ అయిన వెంటనే జిహెచ్‌ఎంసి, ఇతర ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ నివారణ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాయి. అపార్ట్‌మెంట్‌ను కంటైన్‌మెంట్‌ చేశారు. అపార్ట్‌మెంట్‌ పరిసర ప్రాంతాలను సోడియం హైఫోక్లోరైట్‌తో శానిటైజ్‌ చేశారు. స్థానికులను క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అపార్ట్‌మెంట్‌ వాసులతో కలివిడిగా తిరిగిన వారి నుంచి నమునాలను సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపితే మాదన్నపేట్‌లో ఎన్ని కేసులు వెలుగులోకి వస్తాయోనని స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?