ఐపిఎల్‌ వాయిదా!

కరోనా ఎఫెక్ట్‌తో ఏప్రిల్‌ 15 నుంచి నిర్వహించేందుకు సన్నహాలు
నేడు కొత్త షెడ్యూల్‌ అధికారిక ప్రకటన
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ రద్దు
ముంబయి: మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. ఇక అందరూ అనుకుంటున్నట్టుగానే కరోనా కాటుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 2020 సీజన్‌ వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) రెండు వారాల పాటు ఐపీఎల్‌ని వాయిదా వేసింది. భారత దేశంలో ఇప్పటికే కరోనా బారిన పడ్డవారి సంఖ్య 81కు చేరింది. దీంతో ఐపిఎల్‌ మ్యాచ్‌లకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించుకోవాలని బిసిసిఐకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ, దౌత్య మినహా అన్ని విభాగాల వీసాలను ఏప్రిల్‌ 15 వరకు నిషేధించింది. దీంతో విదేశీ ఆటగాళ్లు వాణిజ్య వీసాల విభాగంలోకి వస్తారు కాబట్టి వారు ఐపిఎల్‌ ఆడలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో బిసిసిఐ షాక్‌ తగిలింది. మొదటగా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌ల నిర్వహణకి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఓకే చెప్పారు. అయితే విదేశీ క్రికెటర్లని మాత్రం అనుమతించాలని కోరింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం వీసాల సడలింపునకి నో చెప్పింది. దీంతో ఐపిఎల్‌ని వాయిదా వేయడం, ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించడం తప్ప మరో ప్రత్యామ్నాయం బిసిసిఐకి లేకుండా పోయింది.
ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం
చేసేదేంలేక ఫ్రాంఛైజీలు అందరూ ఐపిఎల్‌ను వాయిదా వేయమని బిసిసిఐని కోరాయి. ఫ్రాంఛైజీల కోరిక మేరకు ఐపిఎల్‌ వాయిదాపై బిసిసిఐ సానుకూలంగా స్పందించింది. రెండు వారాల పాటు ఐపిఎల్‌ని వాయిదా వేయనున్నారు. అయితే శనివారం ఐపిఎల్‌ గవర్నింగ్‌ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమవుతాయి.
‘రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌’ రద్దు
భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజుకు విస్తరిస్తుండటంతో ‘రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌’ను తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సిరీస్‌ రద్దు కావడంతో క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, బ్రయాన్‌ లారాలు నిరాశ చెందారు. అయితే ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం ఇదే సరైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ అదుపులోకి రావాలని మేమంతా ప్రార్థిస్తున్నాం అని సచిన్‌ తెలిపారు. ‘రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న వరల్‌ సిరీస్‌ రద్దవ్వడం దురదృష్టకరం. ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది. కరోనా వైరస్‌ అదుపులోకి రావాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. అందరూ కరోనా వైరస్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోండి’ అని అని సచిన్‌ పేర్కొన్నారు. ‘ప్రస్తుత పరిస్థితి నిరాశ కలిగించింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లను ఆడాలని ఎదురుచూస్తున్నాం. ప్రజలు క్రికెట్‌ కోసం ఎంతో నిరీక్షిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ వంటి లెజెండ్స్‌ ఆటను చూడాలని వారు కోరుకుంటున్నారు. ఈ టోర్నమెంట్‌ ఎంతో అద్భుతంగా ఉంది. ఊహించిన దాని కంటే పోటీ ఎక్కువగా ఉంది. సచిన్‌ తిరిగి మైదానంలోకి రావడం, అతడి ఆటను ప్రజలు ఆస్వాదించడం ఎంతో బాగుంది’ అని లారా అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?