ఐపిఎల్‌ మ్యాచ్‌లు యుఎఇలో

బిసిసిఐ నిర్ణయం..
టి20 వరల్డ్‌కప్‌పై వీడని సస్పెన్స్‌
ముంబయి:
అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో మిగతా 31 మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) లో నిర్వహించాలని భారత క్రికెట్‌ నియంత్ర ణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. శనివారం దృశ్య మాధ్యమ విధానంలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈసారి ఐపిఎల్‌ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీని పూర్తి చేయలేకపోతే, బిసిసిఐకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఫైనల్‌సహా మిగతా అన్నిమ్యాచ్‌లను యుఎఇలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు బిసిసిఐ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, భారత్‌లో నిర్వహించాల్సి ఉన్న టి20 వరల్డ్‌ కప్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, అదనపు సమయాన్ని ఇవ్వాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి)ని కోరాలని బిసిసిఐ తీర్మానించింది.

DO YOU LIKE THIS ARTICLE?