ఐదో దశ ప్రచారం ముగిసింది!

రేపు 51 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఎన్నికలు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పో లింగ్‌కు ప్రచారం శనివారంనాటితో ముగిసింది. ఐదో విడత ఎన్నికలు మే 6వ తేదీన జరుగుతా యి. ఈ దశలో మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంతోపాటు ఆరు ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లోని 51 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌, స్మృతి ఇరానీ, జయంత్‌ సిన్హా, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితరులు ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖులు. ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాల్లోనూ, రాజస్థాన్‌లోని 12 స్థానాల్లో, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏడేసి స్థానాల్లోనూ, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లోని రెండు స్థానాల్లో సోమవారంనాడు పోలింగ్‌ జరుగుతుంది. శనివారం సాయంత్రంతో ఈ దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. యుపి, ఎంపీ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో జాతీయ నాయకులు ఈసారి విస్తృతంగానే ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారీగా ర్యాలీల్లో పాల్గొనగా, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, పలువురు కేంద్రమంత్రులు కూడా వారి వారి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రచారాల్లో పాల్గొన్న ప్రతిచోట ఆసక్తిని రేకెత్తించారు. మోడీకి వ్యతిరేకంగా పదునైన విమర్శలను గుప్పించారు. అలాగే సామాన్య ప్రజానీకంతో మమేకమై వినూత్న రీతిలో ప్రచారం సాగించారు. దాదాపు అందరివీ సుడిగాలి పర్యటనలుగానే సాగాయి. పశ్చిమబెంగాల్‌లో బోంగాంవ్‌ (ఎస్‌సి) స్థానం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి శంతను ఠాకూర్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఒక పోలీస్‌ వ్యాను అదుపు తప్పి ఠాకూర్‌ వాహనాన్ని ఢీకొనడంతో ఆయన గాయపడ్డారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఆఖరి రెండు రోజులు ‘ఫణి’ తుపాను ప్రభావం కారణంగా ప్రచారం పెద్దగా సాగలేదు. పైగా పొరుగు రాష్ట్రం ఒడిశాలో భారీ విధ్వంసం జరగడంతో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల సభలను రద్దు చేసుకున్నాయి. ఈ రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరిగే బోంగాంవ్‌ (ఎస్‌సి), బరక్‌పూర్‌, హైరా, సిరంపూర్‌, ఉలుబేరియా, హుగ్లీ, ఆరంబాగ్‌ (ఎస్‌సి) నియోజకవర్గాల్లో 1,16,91,889 మంది ఓటర్లు 83 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
బీహార్లో మోడీ బిజెపి అభ్యర్థులతోపాటు భాగస్వామ్య పక్షాలైన జెడి(యు), ఎల్‌జెపి అభ్యర్థుల తరపున కూడా ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి ఎంపీలు అజయ్‌ నిషాద్‌, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీలు బీహార్లోని ముజఫర్‌పూర్‌, శరన్‌ నియోజకవర్గాల నుంచి మరోసారి ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్‌జెపి అధినేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఇక తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ తన తమ్ముడు పశుపతి కుమార్‌ పరస్‌ నుంచి హాజీపూర్‌లో నిలబెట్టారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో గల ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా ఈ విడతలో అత్యంత కీలకం కానున్నాయి. తికంగఢ్‌, దామో, ఖజురహో, సత్నా, రేవా, హోషంగాబాద్‌, బీటల్‌ నియోజకవర్గాలు ప్రస్తుతం బిజెపి సిటింగ్‌ స్థానాలు. అయితే వాటిలో కాంగ్రెస్‌ పాగా వేయడానికి ప్రచారాన్ని విస్తృతం చేసింది. కేంద్రమంత్రి వీరేంద్రకుమార్‌ ఖతిక్‌ తికంగఢ్‌లో బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తుండగా, కేంద్ర మాజీమంత్రి, సిటింగ్‌ ఎంపీ ప్రహ్లాద్‌ పటేల్‌ దామో నియోజకవర్గంలో తిరిగి పోటీ చేస్తున్నారు. యుపిలో రాయబరేలీ, అమేథీలతోపాటు దౌరాష్ట్ర, సీతాపూర్‌, మోహన్‌లాల్‌గంజ్‌ (ఎస్‌సి), లక్నో, బాందా, ఫతేపూర్‌, కౌశాంబి (ఎస్‌సి), బారాబంకి (ఎస్‌సి), ఫైజాబాద్‌, బహ్రాయిచ్‌ (ఎస్‌సి, కైసర్‌గంజ్‌, గోండాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈసారి కూడా లక్నో నుంచే బరిలో వున్నారు. ఇక స్మృతి ఇరానీ ఈసారి కూడా అమేథీలో రాహుల్‌గాంధీపై పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌లో కూడా ఈసారి జరగబోయే 12 నియోజకవర్గాల్లో దూకుడుగా ప్రచారం సాగడం విశేషం. కేంద్ర మంత్రులు రాథోడ్‌ (జైపూర్‌ రూరల్‌), మేఘ్వాల్‌ (బికనూర్‌), కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఒలింపియన్‌ కృష్ణపూనియా (జైపూర్‌ రూరల్‌), భన్వర్‌ జితేంద్ర సింగ్‌ (ఆల్వార్‌)లలో బరిలో వున్నారు. రాథోడ్‌, పూనియాల మధ్య పోటీ ఆసక్తికరంగా వుంది. జార్ఖండ్‌లో మరో కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా బరిలో వున్నారు. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా, షోపియన్‌ జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. అనంత్‌నాగ్‌లో మూడో దశ పోలింగ్‌ జరుతుండగా, లడఖ్‌లో ఒకేదశలో ముగించబోతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ఐదో దశ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?