ఐదు స్థానాలకు ఏడు నామినేషన్లు

ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి స్థానానికి గూడూరు నామినేషన్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి స్థానానికి జరగుతు న్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు చివరి రోజైన గురువారం నాడు శాసనసభ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి డాక్టర్‌ వేదాంతం నరసింహాచార్యులకు ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు వెంట సిఎల్‌పి నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎలు ఆత్రం సక్కు, జాజల సురేందర్‌, పొదెం వీరయ్యలు ఉన్నారు. నామినేషన్‌లకు గడవు ముగిసేసరికి ఐదు ఎంఎల్‌సి స్థానాల కోసం ఏడు నామినేషన్‌లు దాఖలయ్యాయి. అందులో టిఆర్‌ఎస్‌ -4, ఎంఐఎం-1, కాంగ్రెస్‌ -1, ఇండిపెండెంట్‌ -1 ఉన్నాయి. టిఆర్‌ఎస్‌ తరుపున హోం మంత్రి మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం,శేరి సుభాష్‌రెడ్డి, ఎంఐఎం తరుపున మీర్జా రీయాజ్‌ ఉల్‌ హసన్‌ ఎఫెండీ, కాంగ్రెస్‌ తరుపున గూడూరునారాయణరెడ్డి నామినేషన్‌లు వేయగా, జాజుల భాస్కర్‌ రెండు రోజుల క్రితం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఎంఎల్‌ఏ కోటాలో పోటీకి నామినేషన్‌ పత్రాలపై కనీసం 10 మంది ఎంఎల్‌ఏల సంతకాలు అవసరం. శనివారం నాడు నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. ఈ సందర్భంగా సరైన పత్రాలు, సరిపడ ఎంఎల్‌ఏల సంతకాలు లేని నామినేషన్‌లను తిరస్కరిస్తారు. అనంతరం ఈ నెల 5వ తేదీ వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అప్పటికీ ఐదుగురి కంటే ఎక్కువ మంది బరిలో ఉంటే ఈనెల 12న పోలింగ్‌ అనివార్యమవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?