ఐదంచెలు తనిఖీ తర్వాతే ‘పది’ఫలితాలు!

విద్యార్థులు ఆందోళన చెందొద్దని కమిషనర్‌ విజ్ఞప్తి
హైదరాబాద్‌ : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల వెల్లడికి ముం దు ఐదు అంచెల్లో వివరాలను తనిఖీ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తయిందని స్పష్టం చేశారు. ఫలితాల వెల్లడిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వెల్లడిలో ఆలస్యమైనా కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందు జాగ్రత్తగా కొన్ని జవాబు పత్రాలు పునఃపరిశీలన చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉం టే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేలా ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేశామన్నారు. ఒక సబ్జెక్టులో అధిక మార్కులు వచ్చి వేరే సబ్జెక్టులో ఫెయిల్‌ అయితే మరోసారి చెక్‌ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో పూర్తి వివరాలు పెడుతున్నామన్నారు. విద్యార్థి పేరు, గ్రేడ్‌ ఏంటి? సబ్జెక్టుల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో తమ సమస్యలను తెలిపితే తమకు చేరినట్టు అక్‌నాలేడ్జ్‌మెంట్‌ కూడా వస్తుందన్నారు. ప్రతి విద్యార్థికీ వచ్చిన మార్కులు, గ్రేడ్లు ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాకే ఫలితాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. ఎవరికైనా సున్నా మార్కులు వచ్చినట్టు తెలిస్తే అది కరెక్టా, కాదా.. అనేది పరిశీలిస్తామన్నారు. ఎవరైనా గైర్హాజరు అవుతే అది వాస్తవమా? కాదా.. అని కూడా పరిశీలిస్తామని, అలాగే ఓ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ వస్తే.. తక్కువ మార్కులు వచ్చిన విషయం వాస్తవమా కాదా.. అనేది కూడా చూస్తామన్నారు. అన్ని అంశాలనూ ధ్రువీకరించాకే ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అందువల్ల ఏ విద్యార్థీ, తల్లిదండ్రులు తమ ఫలితాలు సక్రమంగా వస్తాయో లేదోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?