‘ఐటి గ్రిడ్స్‌’ దర్యాప్తులో స్పీడ్‌ పెంచిన సిట్‌

అశోక్‌ కోసం నాలుగు ప్రత్యేక బృందాల గాలింపు
మాదాపూర్‌ పిఎస్‌లో ఐటి గ్రిడ్‌పై మరో కేసు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో సిట్‌ బాస్‌, ఐజి స్టీఫెన్‌ రవీంద్ర దర్యాప్తు స్పీడ్‌ పెంచారు. ఈ మేరకు తన బృంద సభ్యులతో కలిసి కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తుపై కూలంకశంగా చర్చించినట్లు తెలిసింది. నిన్న మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల విధుల్లో బిజీబిజీగా గడిపిన పోలీసులు అధికారులు శనివారం నుంచి తమ పాత విధులను చూసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఐటి గ్రిడ్స్‌ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్‌లో ఉన్న అధికారులకు ఎన్నికల బందోబస్తు విధులు కూడా అప్పగించడంతో ఈ కేసు దర్యాప్తు పక్షం రోజుల నుంచి పులిస్టాప్‌ పెట్టారు. ఎన్నికల బందోబస్తు విధులు ముగియడంతో ఐటి గ్రిడ్స్‌ డేటా కుంభకోణం కేసులో తిరిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఐటి గ్రిడ్స్‌ సిఇఒ అశోక్‌ ను ఎలాగైనా అరెస్టు చేసేందుకు సిట్‌ బృందం ప్రణాళికలు తయారు చేసింది. తనను ఎవరు అరెస్టు చేస్తారులేనని అశోక్‌ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో తల దాచుకున్నాడు. ఇతనికి అక్కడి పోలీసులు, ప్రభుత్వమే ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఎపిలో కూడా ఎన్నికలు ముగియడంతో అశోక్‌ను ఇక ఎవరు కాపడలేరని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. అతన్ని ఎలాగైనా అరెస్టు చేస్తామనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినట్లు తెలిసింది. అశోక్‌ను రెండు మూడురోజుల్లో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నా యి. లేదంటే అతనే కోర్టు లో లొంగిపోతాడనే వాదనలు కూడా వినిపిస్తున్నా యి. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని అశోక్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ వీగిపోయిన విషయం తెలిసిందే. ఇక అతను అరెస్టునా కావాలి లేదంటే కోర్టులోనైనా లొంగిపోవాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి రెండు మూడు రోజుల్లో తేలిపోతుందని సిట్‌ అధికారులు అంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?