ఐక్య ఉద్యమాలకు సిద్ధంకండి

కార్మికలోకానికి సిపిఐ పిలుపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా కార్మిక లోకానికి సిపిఐ పిలుపునిచ్చింది. మేడే పురస్కరించుకొని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం మంగళవారంనాడొక ప్రకటన విడుదల చేసింది. బుధవారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆ ప్రకటనలో కోరారు. కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కార్మిక సంఘాలపై అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల దోపిడీ విధానాలు తీవ్రతరమైన నేపథ్యంలో కార్మిక సంఘాల పాత్ర మరింత పెరిగిందని పేర్కొన్నారు.“పేదలు, ధనికుల మధ్య అంతరం మరింత పెరిగింది. సంప ద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. కేవలం కొన్ని కార్పొరేట్‌ సంస్థలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధిచెందుతున్న దేశాల సంపదను ఆ వర్గాలు దోచుకుంటున్న నేపథ్యంలో అది వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల సంక్షోభానికి దారితీస్తున్నది. సమన్యాయం, సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు పెరుగుతున్నాయి. ఎఐటియుసి ఆధ్వర్యంలో మన దేశంలో కూడా కార్మిక వర్గం పోరాటాలు చేస్తున్నది. నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి కార్మికులు విపరీతమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగాన్ని పథకం ప్రకారం నాశనం చేస్తున్నది. కార్మిక చట్టాలను అమలు చేయడం లేదు. నూతన పింఛను వ్యవస్థ కార్మికులకు వ్యతిరేకంగా వుంది. అందుకే దేశంలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరం వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కన్నెర్ర చేస్తున్న కార్మికులు సమాజంలోని రైతులు, విద్యార్థులు, యువజనులు వంటి ఇతర వర్గాల సహకారంతో ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు. ఈ పోరాటంలో సిపిఐ వారికి పూర్తిగా అండగా నిలుస్తున్నది. కార్మికుల హక్కులను కాపాడానికి కట్టుబడివుంది. కార్మికులంతా ఏకమై ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైంది” అని సుధాకరరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?