ఏ బటన్‌ నొక్కినా.. కమలానికే ఓటు

ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం
మోడీ అరాచక పాలనకు నిదర్శనం
ఇవిఎంలను తక్షణం రద్దు చేయాల్సిందే
అభివృద్ధి చెందిన దేశాల తరహాలో బ్యాలెట్లను ఉపయోగించాలి
ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాల వినతి

న్యూఢిల్లీ: వివిధ ప్రతిపక్ష నేతలు సోమవారం ఎన్నికల సంఘాన్ని(ఇసి) కలుసుకుని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల ట్యాంపరింగ్‌ సమస్యకు పరిష్కారాన్ని కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ముందు ఇవిఎం ఫలితాలు 50 శాతం మేరకు ఓటర్‌ ధ్రువీకరణ రశీదు(వివిపాట్‌)తో సరిపోతేనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లపై దేశ ప్రజలకు అనుమానాలున్నాయని ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘానికి తెలిపారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఎన్నికల సంఘం ఇతర సభ్యులను కూడా ప్రతిపక్ష నేతలు కలిశారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన ప్రతిపక్ష నాయకులలో…కాంగ్రెస్‌కు చెందిన గులాం నబీ అజాద్‌, మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, ఆనంద్‌ శర్మ, తెలుగుదేశం పార్టీ చీఫ్‌ ఎన్‌ చంద్రబాబు నాయుడు, ఎన్‌సిపి నాయకుడు మజీద్‌ మెనన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు డెరెక్‌ ఓబ్రీన్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకుడు సతీశ్‌ చంద్ర మిశ్రా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా, సిపిఐ(ఎం) నాయకులు మొహ్మద్‌ సలీమ్‌, టికె రంగరాజన్‌, ఆర్‌జెడి నాయకుడు మనోజ్‌ ఝా, ఆప్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌, సిపిఐ నాయకుడు డి. రాజా, జెడి-ఎస్‌ నాయకుడు డానిష్‌ అలీ, ఆర్‌ఎస్‌పి నాయకుడు ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌, ఎఐయుడిఎఫ్‌ నాయకుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌, ఎన్‌పిఎఫ్‌ నాయకుడు కెజి కెన్యే ఉన్నారు. దీనికి ముందు ప్రతిపక్షాలు బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి మళ్లాలని డిమాండ్‌ చేశాయి. కానీ మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి మళ్లడం అన్నది సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేశాక ప్రతిపక్షాలు ఇవిఎం, వివిపాట్‌ల లెక్క 50 శాతం మ్యాచ్‌ అయితేనే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్న కొత్త వ్యూహాన్ని ముందుంచాయి. అనంతరం ప్రతిపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇవిఎంల వాడకం దేశ ప్రజాస్వామ్యాన్నే పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు. ఇవిఎంలలో ఏ బటన్‌ నొక్కినా కమలం గుర్తుకే ఓటు పడడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. మోడీ అరాచకపాలనకు ఇది నిదర్శనమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే బ్యాలెట్లు వాడుతున్నారని, అలాంటిది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో బ్యాలెట్లు వాడకుండా మోసపూరిత ఇవిఎంలు వాడుతూ ఎన్నికల సంఘం పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తక్షణమే ఇవిఎంలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్‌ పత్రాలను తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?