ఏక విధాన పోలీసింగ్‌కు తూట్లు

చీటర్లకు ప్రచారం చేసిన బాలీవుడ్‌ నటులపై కేసు
అదే నేరానికి పాల్పడిన హోంమంత్రికి మాత్రం క్లీన్‌చిట్‌
ఇదెక్కడి న్యాయమంటున్న బాధితులు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏక విధాన పోలీసింగ్‌ నిర్వహిస్తున్నామని డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి ప్రతి సమావేశంలో వెల్లడిస్తున్నారు. ఏక విధాన పోలీసింగ్‌ అంటే నేరం తీరు ఒకే విధంగా ఉన్నప్పుడు అన్ని పోలీసు స్టేషన్‌ల దర్యాప్తు అధికారులు కూడా ఒకే విధంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా ఒకే రకంగా ఉండాలన్న మాట. నేరస్తులు ఎంత పలుకుబడివారైనా పోలీసులు తలొగ్గకుండా బాధితులకు సమన్యాయం కల్పించాలనే ఉద్దేశంతో నేరస్తులు విఐపిలైనా, పలుకుబడిగల వారనైనా కూడా అందరిలాగానే కేసు లు, సెక్షన్‌లు నమోదు చేయాలన్న డిజిపి భావన బాగానే ఉంది. అయితే అది అమలయ్యే పద్దతిలో మాత్రం ఏక విధానం లేదు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసిన క్యూనెట్‌ సంస్థ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం వేల కోట్లలో ఉంది. ఈ సంస్థ తరపున ప్రారంభోత్సవ కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొని ఆ సంస్థ ఉత్పత్తులను, సంస్థ కార్యక్రమాలను ప్రచారం చేసిన బాలీవుడ్‌ నటులు, ప్రముఖ క్రీడాకారులు, ఇతర ప్రముఖులకు సైబరాబాద్‌ పోలీసులు నెల రోజుల క్రితం నోటీసులు పంపించారు. ఒక మోసపోరిత సంస్థ తరపున ఆ సంస్థ కార్యక్రమాలు పొగడం నేర పూరితమవుతుంది. కావున ఈ కేసులో ఆ సంస్థ తరపున ప్రచారం చేసిన ప్రముఖులను సైబరాబాద్‌ పోలీసులు త్వరలో విచారిస్తారన్న భావన ఉంది. ఇంత వరకు బాగానే ఉంది. సరిగ్గా ఇదే తరహాలో వేలాది మంది డిపాజిటర్లకు చెందిన వేల కోట్ల రూపాయలు శఠగోపం పెట్టిన హీరాగోల్డ్‌ సంస్థ కుంభకోణం కేసులో మాత్రం ఆసంస్థ తరపున ప్రచారం చేసిన హోంమంత్రి ఎం.డి. మహమూద్‌ అలీని దర్యాప్తు అధికారులు విచారించడానికి వెనుకడుగు వేశారు. క్యూనెట్‌ కేసులో ఎలాగైతే విఐపిలకు నోటీసులు జారీ చేశారో హీరాగోల్డ్‌ కేసులో కూడా హోంమంత్రికి కూడా నోటీసులు జారీ చేయాలి. అదే ఏక విధాన పోలిసింగ్‌ అంటే. కానీ పోలీసులు మాత్రం హీరాగోల్డ్‌ కుంభకోణం కేసులో ఏకవిధాన పోలీసింగ్‌కు తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన ‘హీరా గోల్డ్‌’ కేసులో నిజానికి హోంమంత్రి ఎం.డి.మహమూద్‌ అలీకీ కూడా దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేయాలి. ఎందుకంటే ఈ సంస్థ చాలా మంచిది, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది,ఆ సంస్థ తయారు చేసే ఉత్పత్తులు అత్యంత అద్భుతంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పారిశ్రామిక వేత్తలు ముందు కు రావడం రాష్ట్రానికి శుభసూచకమని.. అంటూ హీరాగోల్డ్‌ సంస్థను ఆకాశమంత పొగిడారు. ఒక ముఖ్య వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడంతో డిపాజిట్‌ దారులు హీరాగోల్డ్‌ సంస్థపై నమ్మకాన్ని పెంచుకోవడం సహజం. ఈ క్రమంలోనే అధిక వడ్డీ డబ్బులు వస్తాయని బాధితులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి చివరకు మోసపోయారు. ఈ సంస్థపై దేశ వ్యాప్తంగా 27కుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి. ఈ సంస్థ సిఇఒ నౌహీరాషేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మొయినాబాద్‌ ఏరియాలో ఈ సంస్థ పలు వస్తువుల తయారీ కేంద్రాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. ఆ ప్రాంరభోత్సవానికి ప్రస్తుత హోంమంత్రి, అప్పటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ముఖ్య అతిధిగా హాజరై సంస్థ ఉత్పత్తులపై ప్రచారం నిర్వహించారు. హీరాగోల్డ్‌ సంస్థను సుమారు 10 నిమిషాల సేపు పొడిగిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. క్యూనెట్‌ కేసులో ఎలాగైతే విఐపిలకు నోటీసులు జారీ చేశారో అదే తరహాలో హీరాగోల్డ్‌ కేసులో హోంమంత్రి మహమూద్‌ అలీకి నోటీసులు జారీ చేయాలని బాధతులు కోరడంలో తప్పేముంది?

DO YOU LIKE THIS ARTICLE?