ఎస్‌బిఐ కస్టమర్లకు తీపి కబురు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలపై ఇకపై ఏడాది కాలానికి 3 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలపై 3.5 శాతం వడ్డీని ఎస్‌బిఐ ఇస్తోంది. ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పింది. పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌బిఐ 2018 ఏప్రిల్‌ నుంచి కనీస బ్యాలెన్స్‌ నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌బిఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం రూ. 5వేలు ఉంచాలని, లేదంటే పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో గతేడాది అక్టోబరులో ఈ నిబంధనలో కొంత మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్‌ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 3వేలకు తగ్గించింది. మెట్రో, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1000 కనీస బ్యాలెన్స్‌ తప్పనిసరి చేసింది. అంతకుముందు రుణాలు, డిపాజిట్లపై ఎస్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?