ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్‌ తర్జనభర్జనలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు టిపిసిసి ముఖ్య నేతల మేధోమధనం ఆదివారం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలో శాసనసభ ఎన్నికల్లో ఓటమి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అనుసరించాల్సిన వ్యూహం పై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో అక్రమాలకు చెక్‌పెట్టేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని, విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వ లోపాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ సమాజం కలిసొచ్చే వ్యూహంతో ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకులు సూచించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగిన సమావేశాల్లో ముగ్గురు ఇన్‌చార్జిలు శ్రీనివాస కృష్ణన్‌, సలీం,బోసురాజులు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం చేవేళ్ళ, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రాంచంద్ర కుంటియా, పిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్య దర్శులు బోసురాజు, వంశీ చందర్‌ రెడ్డి, ఎం.పి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రా రెడ్డి, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సుధీర్‌రెడ్డి, పిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు కుసుమకుమార్‌, పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై లోతుగా చర్చించారు. శాసనసభ ఎన్నికల్లో దాదాపు 22 లక్షల ఓట్లు తొలగించారని, దీనికి ఎన్నికల కమిషనర్‌ కూడా క్షమాపణ చెప్పారని నాయకులు గుర్తుచేశారు. ఈసారి పకడ్బందీగా వ్యవహరించాలని నాయకులు సూచించారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకని ఓట్ల తొలగింపు, ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరగకుండా ముందుస్తుగానే అప్రమత్తంగా ఉండాలన్నారు. లోక్‌సభ ఎన్నికలను రాహుల్‌, మోడి మధ్యజరిగే జాతీయ ఎన్నికలుగా ప్రచారం చేయాలని, మోడిపైన తెలంగాణ ప్రజలలో పెద్దగా విశ్వాసం లేదని, కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందనే నమ్మకం, తిరిగి కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ది అవుతుందనే విశ్వాసాన్ని కల్పించాలని పలువురు నాయకులు సూచించారు. ప్రధాని మోడికి సిఎం కెసిఆర్‌ భయపడుతున్నారని, సిబిఐ కేసులకు భయపడి కెసిఆర్‌ కేంద్రంపై పోరాటం చేయడం లేదని, లేదని సమీక్షలో పలువురు నాయకులు తెలిపారు. ప్రధానంగా ప్రతి పౌరుని ఖాతాలో రూ 15 లక్షలను జమ చేస్తానని ఇప్పటికీ జమ చేయలేదని,నిత్యవసర ధరల పెంపు, పెద్ద నోట్లరద్దు, జిఎస్‌టి పన్నులు ఇలా పలు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించిందని, అదే స్ఫూర్తితో పార్టీని మరింత లోపేతం చేయాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?