ఎన్నికల వాయిదాపై ఇసిదే నిర్ణయం

రైతులకు అవగాహన కల్పిస్తాం
11న జరిగే ఎన్నికలకు నిజామాబాద్‌లో విస్తృత ఏర్పాట్లు : రజత్‌కుమార్‌

ప్రజాపక్షం/ నిజామాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఈనెల 11వ తేదీనే పోలింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. నిజామాబాద్‌ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండ డం వల్ల దేశంలోనే ప్రత్యేకత చోటు చేసుకుంది. ఎన్నికల తీరుతెన్నులు, గుర్తలపై అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. శుక్రవారం రజత్‌కుమార్‌ నిజామాబాద్‌కు చేరుకున్నారు. నగరంలో వివిధ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. రెండు పర్యాయాలు అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. ప్రత్యేక ఇవిఎంలు అందుబాటులోకి వచ్చిన అనంతరం 185 మంది పోటీలో ఉండడం, అందుకు అవసరమైన ఓటింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. ఇవిఎంలు నియోకవర్గానికి చేరుకున్నాయని, భెల్‌, ఇసిఎల్‌లకు చెందిన 600 మంది ఇంజినీర్లు నిజామాబాద్‌కు చేరుకున్నారన్నారు. ఇవిఎం మొదటి చెకింగ్‌ మూడు నియోజకవర్గాల్లో పూర్తి చేశారని పేర్కొంటూ అభ్యర్థులు ఎదుట మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఇవిఎం మొదటి చెకింగ్‌ ఈ నెల 7లోపు పూర్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పోలింగ్‌ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి కానున్నాయన్నారు. కొందరు అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులపై అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. వారందరితో రెండు పర్యాయాలు సమావేశమై అవగాహన కల్పించామని, అనుమానాలను నివృత్తి చేశామని వివరించారు. మాక్‌ పోలింగ్‌ సందర్భంగా 100 మంది అభ్యర్థులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారన్నారు. అయినా రైతులు వాయిదా వేయాలని కోరుతున్నారని రజత్‌కుమార్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?