ఎత్తి పోత!

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటిని ఎత్తిపోసే పంపును రేపు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం/ హైదరాబాద్‌: ప్రపంచ ఇంజినీరింగ్‌ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్‌ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కృతం కానున్నదని ముఖ్యమంత్రి కార్యాల యం తెలియజేసింది. గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లో పడతాయి. మొత్తం 15 టిఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్‌ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయం సరిగా సాగకుండా ఎడారిగా మారిన కరువు ప్రాంతాలకు నీరు చేరుతుందని సిఎంఒ తెలిపింది. ఈ నెల 29న సిఎం పర్యటన వివరాలను సిఎంఒ బుధవారం ఒక ప్రకటనలో వివరించింది. అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండపోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కార ణం ఉంది. ఉమ్మడి మెదక్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ దేవాలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంటుంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్‌కు మల్లన్న సాగర్‌ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండ పోచమ్మ సాగర్‌ అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ నామకరణం చేశారని సిఎంఒ వివరించింది. కొండ పోచమ్మ సాగర్‌ కూడా ఈ ప్రాంత వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్‌ అమ్మవారి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును ఓ దేవాలయం మాదిరిగా భావిస్తున్న కెసిఆర్‌, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలియజేసింది. చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌజ్‌ (మర్కూక్‌) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సిఎం కెసిఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్‌ వద్ద గల కొండ పోచమ్మ సాగర్‌కు నీటిని లిఫ్టు చేసే పంపుహౌస్‌ వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో పంపుహౌస్‌ వద్దకు వచ్చే చినజీయర్‌ స్వామికి కెసిఆర్‌ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌస్‌ స్విచ్చాన్‌ (ప్రారంభం) చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్‌ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలికి గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహిస్తారని సిఎంఒ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.

DO YOU LIKE THIS ARTICLE?