ఎడాది పాటు పి.వి శతజయంతి నిర్వాహణపై సిపిఐ హర్షం

ప్రజాపక్షం / హైదరాబాద్‌: మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు శతజయంతిని ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పి.వి.నరసింహరావు చిన్నప్పుడే ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆనాడే నిజాం రాచరిక వ్యవస్థ పోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలని కోరుకున్నారని చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. సాయుధ పోరాటంలో ఆయనది ప్రత్యక్ష పాత్ర లేకపోయినా నిజాంను గద్దెదించకపోతే ప్రజాస్వామ్య పాలన రాదని నమ్మేవారని, తనదైన పంథాలో రామానంద తీర్థ చూపిన మార్గాన్ని అనురించారని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పి.వి.నరసింహారావు అంచెలంచలుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పదవులను అధిరోహించారని తెలిపారు. మంథని నియోజకర్గం నుండి ఎంఎల్‌ఎగా గెలిచి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒక ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో గురుకుల పాఠశాల రూపకల్పన చేశారన్నారు. స్వయంగా భూస్వామి అయినప్పటికీ దున్నేవాడికే భూమి కావాలనే కమ్యూనిస్టుల పోరాటాల నేపథ్యంలో భూ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చి, బలహీనవర్గాలకు భూ పంపిణీ చేపట్టారని పేర్కొన్నారు. కేంద్ర మానవవనరుల మంత్రిగా అత్యున్నత విద్యను గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోనికి తెచ్చిన ప్రఖ్యాత నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేసిన విషయాన్ని వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. దేశం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పుతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో దేశ ప్రధానిగా పి.వి.నరసింహరావు బాధ్యతలు చేపట్టారని, మైనార్టీ ప్రభుతాన్ని ఐదేళ్ల కాలం నెట్టుకురావడం ఆయన చాణక్యనీతికి అద్దంపడుతున్నదని తెలిపారు. ఆర్థిక సంస్కరణల తీరు తెన్నుల విషయంలో కమ్యూనిస్టుగా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అమలు చేశారని, దేశానికి ఆర్థిక పరిపుష్టి కల్పించడంలో విశేష పాత్ర పోషించారని అన్నారు. పివి పదవుల కోసం పాకులాడేవ్యక్తి కాదని, వచ్చిన పదవులకు వన్నె తేవడమే ఆయన వ్యక్తిత్వమని, స్వంత గ్రామం, స్వరాష్ట్రం, స్వంత మనుషులు అనే బంధాలకు అతీతంగా దేశమే తనదిగా భావించి విశాల దృక్ఫథం కలిగిన రాజనీతిజ్ఞుడు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యునిగా పివి వ్యక్తిత్వ పటిమ, పట్టుదల కార్యదీక్షను నాటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా శతజయంతి ఉత్సవాలు విజయవంతం కావాలని చాడ వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు.

DO YOU LIKE THIS ARTICLE?