ఎందుకీ నిర్లక్ష్యం!

కరోనా పరీక్షల నిర్వహణలో మీనమేషాలా?
సమాచారాన్ని పత్రికలకు ఇవ్వకుండా దాస్తున్నరెందుకని?
అఫిడవిట్‌లో తప్పులుంటే తీవ్ర పరిణామాలుంటాయ్‌
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
ప్రజాపక్షం / హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఉద్ధృతంగా ఉంటే ప్రభుత్వం నిర్ధారణ పరీక్షలను ఎక్కువగా ఎందుకు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. వేరే రా్రష్ట్రాల్లో కరో నా నిర్ధారణ పరీక్షలు చాలా ఎక్కువగా చేస్తుంటే మనమెందుకు తక్కువగా చేస్తున్నామని నిలదీసింది. కరోనా పరీక్షలు, వైద్యం తదితర విషయాలపై దాఖలైన 9 పిల్స్‌ను బుధవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కరోనా కోర లు చాచి పడగ విప్పే పరిస్థితులు రానీయకుండా చూడాలని, ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే విషయంలోనూ మీనమేషాలు లెక్కపెడితే ప్రమాదం పొడసూపుతుందని హెచ్చరించింది. ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన 9 రిపోర్టులను అఫిడవిట్లగా ఎందుకు దాఖలు చేయలేదని, అఫిడవిట్‌ అయితే అందులో తప్పులుంటే కోర్టు నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయనే నివేదికలుగా ఇస్తున్నారా అనే సందేహాన్ని లేవనెత్తింది. రోజువారీ కరోనా బులిటెన్‌లోని విషయాలను పత్రికల్లో ప్రచురించాలనే ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని, ‘ఈనాడు’ ప్రాంతీయ పత్రికకు మాత్రమే ఇచ్చార ని ప్రశ్నించింది. బులిటెన్‌లోని వివరాలు వెల్లడిస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, ఉదాహరణకు జూన్‌ 17 బులిటెన్‌ చూస్తే కరోనా బాధితుల వయసు 26 నుంచి 35 ఏళ్లని, అంటే యువత కూడా జాగ్రత్తగా ఉండాలనే సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేకపోయామని తప్పుపట్టింది. రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ విధానం ఏమిటో చెప్పాలి. గత నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం ఏయే అంశాల్ని గుర్తించిందో చెప్పాలి. కరోనా కట్టడికి ఏం చేయాలని చెప్పింది. ఈ విషయాలేవీ కూడా పత్రికల్లో రాలేదు. బృందం వచ్చింది.. వెళ్లింది అన్నట్లుగా ఉంటే ఎలాగని, కనీసం హైకోర్టుకు కూడా ఆ వివరాలు ఇవ్వలేదని ఆక్షేపించింది. ఐసిఎంఆర్‌ రూల్స్‌ మేరకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చీఫ్‌ సెక్రటరీ, సౌకర్యాలు లేక ఆపేశామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పరస్పరం విరుద్ధంగా చెప్పడాన్ని తీవ్రంగా పరిగణిస్తే ఏమౌతుందని ప్రశ్నించింది. పరీక్షలు ఆపేయడం కోర్టు ధిక్కారమని శ్రీనివాస్‌రావుకు తెలియదా అని కూడా ప్రశ్నించింది. పరీక్షలు చేయడం ఆలస్యం చేస్తుంటే ఇది మరో 2 ఏళ్ల వరకూ ఇలాగే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఈ నెల 17లోగా అమలు చేయాలని, లేయకపోతే ఈ నెల 20న జరిగే విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్లు హైకోర్టు విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా కేసుల వివరాల నమోదు గురించి సమాచార హక్కు చట్టం కింద అడిగితే అధికారులు ఎందుకు ఇవ్వలేదని, వెంటనే ఇచ్చి తమకు కూడా నివేదించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్‌ నమూనాలు ఎన్ని తీసుకున్నారో, ఎన్ని పరీక్షలు చేశారో చెప్పాలని కూడా కోరింది. పది రోజుల్లో 50 వేల పరీక్షలు చేయాలనే లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయారని ప్రభుత్వాన్ని కోరింది. జూన్‌ 16 నుంచి 26వ తేదీ వరకూ రోజుకు 5 వేలు చొప్పున 50 వేల పరీక్షలు చేయాలని నిర్ణయించి 33 జిల్లాలకుగాను 12 జిల్లాల్లో 30, 899 పరీక్షలనే చేశారని, ఇదే కాలంలో ఎపిలో 2.11 లక్షల పరీక్షలను నిర్వహించిందని హైకోర్టు గుర్తు చేసింది. మిలియన్‌ జనాభాకు 2215 టెస్ట్‌లు మాత్రమే పరీక్షలు చేశారని, ఎపి 16 వేలు, తమిళనాడు 14 వేలు, మహారాష్ట్ర 9.5 వేలు కర్నాటక 9 వేలు, ఢిల్లీలో 25 వేలు చొప్పున పరీక్షలు జరిగాయని, తెలంగాణలో ఎందుకు ఆ స్థాయిలో చేయలేకపోతున్నామని హైకోర్టు నిలదీసింది. సమగ్ర సమాచారాన్ని కోర్టుకు అందజేసేందుకు సమయం కావాలని ఎజి బిఎస్‌ ప్రసాద్‌ కోరారు. దీంతో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.

DO YOU LIKE THIS ARTICLE?