ఎంఎల్‌సి షెడ్యూల్‌ వెనుక కుట్ర

కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ర్టంలోని మూడు స్థానిక సం స్థల ఎంఎల్‌సి స్థానాలకు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల షెడ్యూల్‌ విషయంలో కుట్ర కోణం దాగి ఉందని కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్‌ శ్రవణ్‌ దా సోజు బుధవారం ఢిల్లీలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిసి ఈ మేరకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల తమ పదవులకు ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో డిసెంబర్‌ 2018లో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ సీట్ల కోసం ఈ ఏడాది మార్చినెలలో జరిగిన రెండు టీచర్లు, ఒక పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సీట్లతో కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, అయితే అలాంటి ప్రక్రియ జరగలేదన్నారు. కారణాలు ఏవీ పేర్కొనకుండానే మార్చిలో జరగాల్సిన ఎన్నికలు ఇప్పటివరకు సాగదీసి హఠాత్తుగా షెడ్యూల్‌ విడుదల చేసి హుటాహుటిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారని శ్రవణ్‌ పేర్కొన్నారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను 6వ తేదీ అర్ధరాత్రి విడుదల చేశారని శ్రవణ్‌ వెల్లడించారు. టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో షెడ్యూల్‌ రూపొందించినట్లుగా వెనువెంటనే టిఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిందని తెలిపారు. ఇలా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన సమయం, టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఖరారు సమయం దాదాపుగా ఒకటే కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని, తద్వారా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకాన్ని కోల్పోయాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్‌పిటిసి, ఎంపటిసిలకు ఓటు హక్కు ఉంటుందని శ్రవణ్‌ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మే6వ తేదీన తొలి విడత పోలింగ్‌ జరిగిందని, మే 10, 14వ తేదీల్లో రెండో, మూడో విడత పోలింగ్‌ జరగనుందని వివరించారు. ఫలితాలు మే 27వ తేదీన వెలువడతాయని పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?