ఎంఎల్‌ఎ బాజిరెడ్డికి కరోనా

ఆయన భార్యకు నెగెటివ్‌ హోం క్వారంటైన్‌లోకి అనుచరులు

ప్రజాపక్షం/నిజామాబాద్‌ : తెలంగాణలో మరో శాసనసభ్యుడు కరోనా మహమ్మారి బారినపడ్డారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు ఆదివారం నాడు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా ఒంట్లో బాలేకపోవడంతో బాజిరెడ్డితో పాటు ఆయన సతీమణికి శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బాజిరెడికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఆయన భార్యకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం ఎంఎల్‌ఎ దంపతులు చికిత్స నిమమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా బాజిరెడ్డి గోవర్దన్‌ శనివారం డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వందమందికి పైగా నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. బాజిరెడ్డికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన అనంతరం ఎంఎల్‌ఎ కుటుంబసభ్యులు, అనుచరులను అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు.

DO YOU LIKE THIS ARTICLE?