ఊరికి రావద్దు!

హైదరాబాద్‌ అంటేనే హడలెత్తిపోతున్న గ్రామస్తులు

హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్‌ గ్రామాలకు ప్రబలుతుందని, తమకు కూడా కరోనా సోకుతుందేమోనని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన వారిని ఆరోగ్య సిబ్బంది పరీక్షించి కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా ఐదారు రోజులపాటు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఆ తరువాత వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతేనే గ్రామాలలో తిరగనిస్తున్నారు.

ప్రజాపక్షం / హైదరాబాద్‌  హైదరాబాద్‌లో కరానో విజృంభిస్తుండడంతో ఊరు బాట పట్టిన వారితో గ్రామాలలో టెన్షన్‌ మొదలైంది. హైదరాబాద్‌ నుంచి ఎవరైనా వచ్చారంటేనే గ్రామాల్లోని ప్రజలు హడలెత్తిపోతున్నారు. మెజారిటీ కరోనా కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. కరో నా వ్యాప్తి నివారణ కోసం హైదరాబాలోని ఐటి సంస్థలతో సహా అనేక సంస్థలు, కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్‌ నగరం నుంచి ప్రజ లు తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కరోనా ఉన్నప్పటికీ నమోదవుతున్న కేసుల సంఖ్య పదులలోనే ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్‌ గ్రామాలకు ప్రబలుతుందని, తమకు కూడా కరోనా సోకుతుందేమోనని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఎవరైనా గ్రామాలకు వస్తే ఐదారు రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు నిబంధనలు విధిస్తున్నారు. తమ ఇరుగు పొరుగు ఇళ్లలో ఎవరైనా కొత్త వారు కనిపిస్తే ప్రజలు భయపడుతూ సమీప పోలీసు స్టేషన్‌లో, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఇరుగు పొరుగు ప్రజల సమాచారం మేరకు పోలీసులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొత్తగా వచ్చిన వారిని పరీక్షించి కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా ఐదారు రోజులపాటు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇంటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. ఐదారు రోజుల తరువాత వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతేనే గ్రామాలలో తిరగనిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తమను ఇబ్బందులకు గురిచేయవద్దని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పలు ప్రాంతాలు ఖాళీ : రోడ్లపై తగ్గిన రద్దీ
హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అద్దెకు ఉంటున్న వారు ఇళ్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలిపోతుండగా, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు తమ సొంత ఊళ్లకు వెళ్ళి ఆన్‌లైన్‌లోనే పనులు చేస్తున్నారు. అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, మల్లేపల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కాప్రా, ఎల్‌బినగర్‌తో పాటు పాతబస్తీలోని చంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో జన సంచారం తగ్గింది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌ రోడ్లపై రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి బయటకు రావాలంటనే జంకుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?