ఉన్న పథకాలే అమలు కావడం లేదు

ఇంకా తీపి కబురా!
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్‌: రైతులకు ఉన్న పథకాలే అమలు కావడం లేదని, ఇంకో తీపి కబురా? అని టిపిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలన్నారు. రాష్ర్టంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారని, ఆ కమీషన్లతోనే సిఎం కెసిఆర్‌ ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెడ్‌పిటిసిలతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ తన అక్రమ సంపాదనతో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలను, ప్రజాప్రతినిధులను కొంటున్నాడని ఆరోపించా రు. ముఖ్యమంత్రి కొద్దిగానైనా సిగ్గుపడాలని, రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేశా రా అని ప్రశ్నించారు. రైతుబంధు, రుణమాఫీ పథకాలు అందరికీ అమలు కాలేదని గుర్తు చేశా రు. పంటల నష్టాలకు ఒక పైసా కూడా పరిహారాన్ని ఇవ్వలేదని, ఇంకా కొత్త పథకమా, శుభవార్తనా అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులతోనే ఇప్పటికీ నీళ్లు వస్తున్నాయని, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ ద్వారా నీళ్లు వస్తే కాళేశ్వరం నీళ్లు అంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఇది గలీజ్‌ ప్రభుత్వమని, ఈ పాలకులను వదిలిపెట్టబోమని, ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కెసిఆర్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, సర్పంచ్‌లకు, మండల పరిషత్తులకు నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ రెండు రకాల పోరాటం చేయాలని ఒకటి పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం, రెండవది ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?