ఉద్యోగులను  తొలగించొద్దు

పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు అండగా నిలవాలి
మున్సిపల్‌ శాఖమంత్రి కె.టి.రామారావు

జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రులు కెటిఆర్‌, మల్లారెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమన్యంపై ఉన్నదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖమంత్రి కె.టి.రామారావు అన్నారు. సోమవారం జిహెచ్‌ఎంసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తో కలిసి అన్ని జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకటించి న లాక్‌డౌన్‌తో గత నెలరోజుల నుండి దాదాపు అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఈ సందర్భంగా ఒక్క కార్మికున్ని కూడా ఉద్యో గం నుండి తొలగించొద్దని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరిశ్రమలకు విద్యుత్‌ బిల్లులు, ఆస్తిపన్ను చెల్లింపులో ప్రభు త్వం అనేక  వెసులుబాట్లు కల్పించిందన్నారు. ఏ పరిశ్రమకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయరాదని స్పష్టంగా ఆదేశించామన్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు రోజువారి కూలీ పనులతో మనుగడ సాగించేందుకు వివిధ రాష్ట్రాలు, చుట్టుప్రక్కల జిల్లాల నుండి వచ్చిన వలస కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మానవీయ కోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికులు కూడా భాగస్వాములేనని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఫ్యాక్టరీల వద్ద ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రేషన్‌ కార్డులేని వారికి బియ్యం- జిల్లా కలెక్టర్లకు అధికారాలు
రేషన్‌ కార్డులేనివారికి కూడా బియ్యం, నగదును మంజూరు చేసే అధికారాలను జిల్లా కలెక్టర్లకు కల్పించామన్నారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ పొడగింపుతో ఎటువంటి పనులు చేయకుండా ఖాళీగా ఉంటున్న కార్మికులలో తమ ప్రాంతాలకు వెళ్లాలనే భావన కలుగుతుందని, అయితే వలస కార్మికులు రోడ్లపైకి రావడం వలన ఇంత వరకు అమలు చేసిన లాక్‌డౌన్‌ లక్ష్యం దెబ్బతింటుందన్నారు. ఎక్కడ ఉన్న కార్మికులను అదే ప్రదేశంలో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను కోరారు. పని ప్రదేశాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇ.ఎస్‌.ఐ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ వైద్యుల సేవలను కూడా తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌  నెంబర్లను కార్మికులకు అందజేయాలన్నారు. అత్యవసర సేవలను అందించేందుకు కొన్ని రకాల పరిశ్రమలను నడిపేందుకు ప్రభుత్వం గతంలోనే వెసులుబాటు కల్పించిన విషయాన్ని కెటిఆర్‌ గుర్తు చేశారు. పరిశ్రమలలో వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. పని ప్రదేశంలో కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాల్సిన బాధ్యత యాజమన్యాలదేనని స్పష్టం చేశారు. అవసరమైనచోట గ్లౌసులు కూడా ఇవ్వాలన్నారు. సదరు పరిశ్రమలు 30- శాతం సామర్థ్యం మేరకే నడవాలన్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణకు ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, కమిషనర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌, కార్మిక శాఖ కమిషనర్‌ నధీమ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?