ఉద్యోగాలు ఊడుతున్నాయ్

‌తీవ్ర సంక్షోభంలో ఐటి రంగం వేతన జీవుల యాతన

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో ఐటి రంగంలోని ఉద్యోగుల కష్టాలు అంతా ఇంతా కావు. ఇన్నాళ్లూ సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో కరోనా మహమ్మారి అనుకోని ఉపద్రవాన్ని తెచ్చి పెట్టింది. ఇంకా చెప్పాలంటే భారీ కుదుపుతో ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. నిరుద్యోగుల సంఖ్యా ఈ నెల లో అనూహ్యంగా పెరిగి పోతోంది. దేశ వ్యాప్తం గా 3.4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఒక అంచనా. లాక్‌డౌన్‌ విధించిన నెల రోజుల్లోనే దాదాపు 12 కోట్ల మంది వరకు ఉపాధి కోల్పోయినట్లు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత మరిన్ని ఉద్యోగాలు పోతాయా? అన్న సందేహాలు ఐటి రంగ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం 30 శాతం దాటేసినట్లు అధ్యయన సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఈ నిరుద్యోగిత 7.8 శాతంగానే ఉండిందని, ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌తో ఒక్క సారిగా 23 శాతానికి చేరకుందని చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ పెరిగే కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పాటు సామాన్యులు ఆర్థిక నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగాలు ఊడి పోతాయని తెలుసుగానీ, కరోనా లాక్‌డౌన్‌ వల్ల మొత్తం జీవితాలు తల్లకిందులవుతాయని ఊహించలేక పోయామని ఐటి రంగ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతన జీవుల యాతన
వెయ్యి , రెండు వేల రూపాయల జీతాలు అందుకునే చిరు ఉద్యోగులు మొదలుకొని ఐదు అంకెల జీతాలు పొందే వేతన జీవుల ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా వేతన జీవులకు ఉద్యోగ అభద్రత నెలకొందని పలు అధ్యయన సంస్థలు తెలియజేస్తున్నాయి. ఇలా ఉద్యోగాలు పోతున్నది ఈ రంగ మూ, ఆ రంగమూ అని కాదు, ఐటి సహా ఇతర అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఐటి రంగ సంస్థలు లెక్కలేనన్ని ఉన్నా పేరు ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు 50 నుండి 100 వరకు ఉన్నాయి. వీటిలో గూగుల్‌, ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌, మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సైయ్యంట్‌ లిమిటెడ్‌, డాక్టర్‌ రెడ్డిస్‌ లేబొరోటరీస్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, ఎడిపి ప్రైవేట్‌ లిమిటెడ్‌, జెన్‌పాక్ట్‌, క్యాప్‌ జెమినీ, అమెరికన్‌ జనరిక్స్‌ ఇండి యా లిమిటెడ్‌ ఇలా వందకు పైగా కంపెనీలు ఐటి రంగంలో పేరు గాంచిన వుఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటి రంగంలోని ఇలాంటి కంపెనీలు ఊహించని నష్టాలు ఎదుర్కొంటున్నాయి. విదేశీ కంపెనీల నుండి రావాల్సిన టెక్నాలజీ ఉత్పత్తి ఆధారిత ఆర్డర్లు రాక దిగాలు పడుతున్నాయి. తెలంగాణలోనే కాదు, యావత్‌ దేశమంతే ఐటి రంగ ఆధారిత కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ నష్టాలను కొద్దిలో కొద్దిగా నైనా తగ్గించుకుందామని భావిస్తున్న ఆయా ఐటి రంగ కంపెనీలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగాల్లో కోత పెట్టడం మి నహా మరో మార్గం కనిపించడం లేదంటున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?