ఉత్తమ్‌ ప్రచారంలో ఉద్రిక్తత!

కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాలో ఘటన

ప్రజాపక్షం / హుజూర్‌నగర్‌: టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాం గ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. కుర్చీలతో కొట్టుకున్నారు. మూడో విడత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో భాగం గా ప్రచారం నిర్వహించేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీక్లా నాయక్‌ తండాకు వెళ్లారు. అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతుండగా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారంటూ ఓ టిఆర్‌ఎస్‌ కార్యకర్త నిలదీశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ వర్గీయులు అతడిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలను వారించటంతో గొడవ సద్దుమణిగింది. ప్రసంగం అనంతరం ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోగానే మరోసారి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ ఎంపిటిసి లకావత్‌ రామారావు ఇంటిపై టిఆర్‌ఎస్‌ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిం ది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు.

DO YOU LIKE THIS ARTICLE?