ఉత్కంఠ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలుపు

విఫలమైన బ్యాట్స్‌మెన్స్‌, తొలి టి20లో భారత్‌ ఓటమి
విశాఖ పట్నం: భారత్‌ మధ్య జరిగిన ఉత్కంఠ తొలి టి20లో ఆస్ట్రేలియా చివరి బంతికి 3 వికెట్లతో విజయాన్ని అందుకుంది. భారత బ్యాట్స్‌మెన్స్‌ ఘోరంగా విఫలమైనా.. బౌలర్లు చివరి కంఠం వరకు అద్భుతంగా పోరాడారు. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 126/7 పరుగులు చేసింది. కెఎల్‌ రాహుల్‌ (50) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌ ఆఖరి ఓవర్‌ చివరి బంతికి 127/7 పరుగులు చేసి విజయం సాధించింది.
ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20లో స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే భారత బౌలర్లు షాకిచ్చారు. ఓపెనర్‌ మార్కుస్‌ స్టోయినీస్‌ (1) రనౌట్‌ కాగా.. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (0)ను బుమ్రా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ పంపాడు. దీంతో ఆసీస్‌ 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో డిఆర్సీ షార్ట్‌ (37; 37 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ (56; 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. తర్వాత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ను చాహల్‌ తెలివైన బంతితో పెవిలియన్‌ పంపాడు. తర్వాత కొద్ది సేపటికే మరో సెట్‌ బ్యాట్స్‌మన్‌ డిఆర్సీ షార్ట్‌ను కృనాల్‌ అద్భుతంగా రనౌట్‌ చేశాడు. తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు వరుస క్రమాల్లో వికెట్లు తీస్తూ పోయారు. దీంతో మ్యాచ్‌లో తిరిగి ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రా, కృనాల్‌ పాండ్యాలు అద్భుతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేశారు. కుదురుగా ఆడుతున్న మరో కీలక బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ (13)ను బుమ్రా ఔట్‌ చేసి భారత్‌ విజయంపై ఆశలు రేపాడు. కానీ చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా కమిన్స్‌ (3 బంతుల్లో 7నాటౌట్‌), జయ్‌ రిచర్డ్‌సన్‌ (3 బంతుల్లో 7 నాటౌట్‌) చెలరేగి ఆడడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్‌ చివరి బంతికి విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 127/7 పరుగులు చేసి మూడు వికెట్ల విజయం సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా 16 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు కృనాల్‌, చాహల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (5) పరుగులు మాత్రమే పెవిలియన్‌ చేరడంతో టీమిండియా 14 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌తో కలిసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కొద్ది సేపటివరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే భారత్‌ 6.1 ఓవర్లలో 50 పరుగుల మార్కు పూర్తి చేసుకుంది. ధావన్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెఎల్‌ రాహుల్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడి వేగంగా పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లీ కూడా దూకుడుగా ఆడడంతో పరుగుల వేగం గణణీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే 33 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. తర్వాత కొద్ది సేపటికే ధాటిగా ఆడుతున్న విరాట్‌ కోహ్లీ (24; 17 బంతుల్లో 3 ఫోర్లు)ను ఆడమ్‌ జంపా పెవిలయన్‌ పింపి భారత్‌కు పెద్ద షాకిచ్చాడు. దీంతో 69 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులో వచ్చిన యువ సంచలనం రిషభ్‌ పంత్‌(3) అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో భారత్‌ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు రాహుల్‌ మాత్రం దూకుడును ప్రదర్శిస్తూ ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈక్రమంలోనే కెఎల్‌ రాహుల్‌ 35 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే రాహుల్‌ను కౌల్టర్‌ నైల్‌ ఔట్‌ చేసి భారత్‌కు మరో ఎదురుదెబ్బేశాడు. తర్వాత మరింతగా చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. మంచి లైన్‌ అండ్‌ లెన్త్‌తో బౌలింగ్‌ చేస్తూ వరుసక్రమంలో వికెట్లు తీస్తూ పోయారు. వీరి ధాటికి దినేశ్‌ కార్తీక్‌(1), కృనాల్‌ పాండ్యా(1), ఉమేశ్‌ యాదవ్‌(2)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. మరోవైపు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఒంటరి పోరాటం చేస్తూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ధోనీ (29 నాటౌట్‌; 37 బంతుల్లో 1 సిక్స్‌) కడవరకూ క్రీజులో ఉండటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆరుగురు భారత ఆటగాళ్లు రెండంకెల స్కోరును దాటలేక సింగిల్‌ డిజిట్కే పరిమితం కావడం గమనార్హం. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, ప్యాట్‌ కమిన్స్‌ బెహ్రన్డార్ఫ్‌ తలో వికెట్‌ తీశారు.

DO YOU LIKE THIS ARTICLE?