ఇసుక లారీల్లో హైదరాబాద్‌కు గంజాయి

గుట్టురట్టు చేసిన డిఆర్‌ఐ అధికారులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఇసుక లారీల్లో నర్సిపట్నం నుంచి హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న గంజాయి గుట్టును దైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు. పైన ఇసుక వేసి కింద గంజాయి బ్యాగ్స్‌ అమర్చి లారీలో తరలించే ప్రయత్నం చేసిన దుండగులను పట్టుకోవడంతో ఈ కొత్త రకం స్మగ్లింగ్‌ ఉదంతం బయటపడింది. నర్సీపట్నంలోని సాపర్ల గ్రామం నుంచి ఇసుల లారీ బయల్దేరిందనే విశ్వసనీయ సమాచారం రావడంతో డిఆర్‌ఐ అధికారులు విజయవాడ రహదారిపై కాపు కాసారు. ఆదివారం తెల్లవారు జామున అధికారులు సదరు లారీని ఆపి ఇసుకను తవ్వి చూడగా ఇసుక కింది భాగం లో గంజాయి బ్యాగ్‌లను గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసిన డిఆర్‌ఐ అధికారులు లారీ సీజ్‌ రూ.2.27 కోట్ల విలువైన 1,137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ రకంగా హైదరాబాద్‌కు ఇంత వరకు ఎంత గంజాయిని సరఫరా చేశారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రదారులను సైతం విడిచిపెట్టే ప్రసక్తేలేదని వారు తేల్చారు.

DO YOU LIKE THIS ARTICLE?