ఇవిఎం బటన్‌ నొక్కేందుకు కర్రచెక్కలు

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం
న్యూఢిల్లీ : ఇకపై ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు ఇవిఎం బటన్‌ను చేతివేలితో నొక్కాల్సిన పనిలేదు. ఎన్నికల సంఘం ఓటర్ల కోసం ప్రత్యేకంగా కర్రచెక్కలను ఏర్పాటు చేస్తున్నది. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఇవిఎంల ద్వారా అది సోకకుండా సిఇసి ఈ ప్రయత్నం చేస్తున్నది. కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలు వినూ త్న నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. పోలింగ్‌ సమయంలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే 65 ఏళ్ల పైబడిన వాళ్లతో పాటు కోవిడ్‌ బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించిన ఈసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇవిఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్ల కు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయించింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మధ్య ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఈసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వారికి ఖాదీ మాస్కులతో పాటు శానిటైజర్‌ కూడా చేయనుంది. ఓటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకు అదనంగా 45 శాతం పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. అలాగే ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే అవకాశం కల్పించనుంది

DO YOU LIKE THIS ARTICLE?