ఇవిఎంలు మాకొద్దు

బిక్షాటన చేస్తూ ఓట్లను అభ్యర్థించిన రైతులు

ప్రజాపక్షం/ జగిత్యాల: ఇవిఎంలు వద్దు, బ్యాలెట్‌ ద్వారానే ఎన్నిక నిర్వహించాలని రైతు అభ్యర్థులు కోరారు. నిజామాబాద్‌ పార్లమెంటు బరిలో నిలిచిన పసుపు రైతు అభ్యర్థులు సోమవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. బిక్షాటనం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్‌ ఆవరణలో మహిళా రైతులతో అభ్యర్థులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం కూడా చిన్నచూపు చూస్తోందన్నారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తే.. ఇవిఎంలను ఏర్పాటు చేస్తామనడం దురదృష్టకరమన్నారు. అంతే కాకుండా వరస క్రమంలో అభ్యర్థుల జాబితాను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రధాన పార్టీల గుర్తులు పైన వచ్చేలా ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికైనా అభ్యర్థుల పేర్లను వరస క్రమంలో ఏర్పాటు చేయాలని రైతు అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. రైతే రాజు అని చెప్పుకునే పార్టీలు సైతం పసుపు రైతులను విస్మరిస్తున్నాయని దుయ్యబట్టారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే ఆయా పార్టీల అభ్యర్థులు రైతులకు మద్దతుగా పోటీ నుండి తప్పుకోవాలని కోరారు. రైతుల కష్టాలు రైతులకే తెలుస్తాయని స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?