ఇలా అయితేకష్టమే!

జులై 31 నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుంది
కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ జాజు
జిహెచ్‌ఎంసిని సందర్శించిన కేంద్ర బృందం
కొవిడ్‌-19 వ్యాప్తిపై వివరాలు సేకరణ
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఇచ్చారని, ఇదే మాదిరిగా కేసుల సంఖ్య నమోదైతే జులై 31 నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ జాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో కొవిడ్‌- వ్యాప్తిని నియంత్రించేందుకు హోం కంటైన్మెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమని సంజయ్‌ జాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో సంజయ్‌ జాజు, వికాస్‌ గాడే, డాక్టర్‌ రవీందర్‌లతో కూడిన కేంద్ర బృందం జిహెచ్‌ఎంసి కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతమహంతి, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌ బి.సంతోష్‌, చీఫ్‌ సిటీప్లానర్‌ దేవేందర్‌రెడ్డి, కొవిడ్‌ కంట్రోల్‌ రూం ఒఎస్‌డి అనురాధలతో భేటీ అయ్యారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కమ్యూనిటీ సహకారం చాలా కీలకమని సంజయ్‌ జాజు అన్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నందున, ప్రైవేట్‌గా నిర్వహించిన పరిక్షలలోనే 70శాతం పైబడి పాజిటివ్‌ కేసులు వస్తున్నాయన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో జోన్‌లు, సర్కిళ్లు, వార్డుల వారీగా నెలకొన్న పరిస్థితిపై వాకబు చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో గుర్తించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్న విధానాలు, కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వ్యక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న సదుపాయాలు, ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌, హోం ఐసోలేషన్‌, కంటైన్మెంట్‌ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం రోజుకు 100 కేసులకంటే ఎక్కువగా నిర్థారణ అవుతున్నందున జిహెచ్‌ఎంసి పరిధిలోనే నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటి కమిషనర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్నితీసుకుంటూ, సమన్యయాన్ని పెంచాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సూచనలు, సహకారాన్ని పొందేందుకు సంబంధిత వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రజారోగ్య సంచాలకులతో పాటు తనను కూడా చేర్చాలన్నారు. కొవిడ్‌ కంట్రోల్‌ రూం చేస్తున్న విధుల గురించి కూడా సంజయ్‌ జాజు వాకబు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?