ఇప్పట్లో కరోనా కట్టడి కష్టమే!

రానున్న రోజుల్లో మహమ్మారి పెరిగే అవకాశం
ఎదుర్కొనేందుకు సిద్ధం, అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రజలేవ్వరూ భయపడొద్దు : వైద్య ఆరోగ్య శాఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌: రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ కేసులు మరిం త పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు వీలుగా చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సన్నద్ధంగానే ఉన్నదని డైరక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత కేసులు పెరిగాయని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్ర త, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఇవే కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట అని స్పష్టం చేశారు. తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదన్నారు. రాష్ట్రం లో లాక్‌డౌన్‌ను సుమర్ధవతంగా నిర్వహిస్తున్నామని, సడలింపుల అనంతరం కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేష్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ ప్రారంభం నుండి రాష్ట్రంలో కొత్తగా 1005 కేసులు నమోదయ్యాయని, ఇందులో 470 కుటుంబాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ సమయలో కొందరు వ్యక్తుల వల్లనే అనేక కుటుంబాలకు వైరస్‌ సోకిందని, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కొన్ని ప్రాంతాల్లో గత 15 రోజులుగా కేసులు పెరిగాయని వెల్లడించారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రానికి వస్తున్న వారిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ఆయన వివరించారు పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన 71 మందిలో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే అత్యధికంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులకు ఇంట్లో వసతి లేకపోతే ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2008 కేసులు ఉన్నాయని, ఇందులో విదేశాలు, మర్ఖజ్‌ కేసులు అధికంగా ఉన్నారని, అలాగే లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు రావడం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కోటి కుటుంబాల ఉంటే కేవలం 546 కుటుంబాలు మాత్రమే వైరస్‌తో ఇబ్బంది పడ్డాయన్నారు. బోరాబండలో ఓ యువకుడి ద్వారా 14 మందికి కరోనా పాజిటవ్‌ వచ్చిందని, ఒక బర్త్‌డే పార్టీ ద్వారా 82 మంది ఇబ్బంది పడ్డారని వివరించారు. ఒక వ్యక్తి ద్వారా వికారాబాద్‌, హైదరాబాద్‌లో ఉన్న రెండు కుటుంబాలకు వైరస్‌ సోకిందని, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఒక వ్యక్తి ఫంక్షన్‌ నిర్వహించడం ద్వారా 10 కుటుంబాలకు వ్యాధి సోకిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ బయటకు రాకూడదని, ఫంక్షన్లు, శుభకార్యాలు పెట్టుకోవద్దని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ కొందరు వినలేదని పేర్కొన్నారు. కొన్ని సడలింపుల ద్వారా బహిరంగంగా పార్టీలు, ఇళ్లల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడంతో ఇలాంటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్నారు. ప్రధానంగా లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేసిన ప్రదేశాల్లో కేసులు పెరిగాయన్నారు. సర్వ్‌లెన్స్‌ సర్వే ద్వారా కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని పరిశీలిస్తున్నామన్నారు. డాక్టర్‌ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల మంచి పరిణామాలు చూశామని, చాలా వరకు కట్టడి చేశామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారని, భద్రతా చర్యలు తీసుకుంటున్నారని, లాక్‌డౌన్‌ సమయంలోనే కరనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించగలిగామని వివరించారు. ఈ పరిణామాలు కరోనా కట్టడికి ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో కేసులు పెరుగుతాయని, అందకు తాము పూర్తి కార్యాచరణతో సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో సదుపాయాలు, పరికరాలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలు భయబ్రాంతులు కావాల్సిన అవసరం లేదన్నారు. చికిత్సకు అవసరమైన ఆక్సిజన్‌ సిద్ధంగా ఉన్నదని, గాంధీ ఆస్పత్రిలో 1500 ఆక్సిజన్‌ లైన్స్‌ వేశామన్నారు. జిల్లా, మెడికల్‌ కళాశాలలో కూడా తగిన సౌకర్యాలను ఏర్పాటు చేశామని వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?