ఇక వేడి నుంచి ఉపశమనమే!

1వ తేదీనే కేరళను తాకనున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ : దేశంలో నిప్పులకొలిమిని తలపిస్తు న్న మండే ఎండల నుంచి ఉపశమనంలా చల్ల ని కబురు అందింది. ఏటా ఈ సమయానికి మనం ఎదురుచూసే నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ ఐఎండి గురువారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ మాల్దీవులు-కొమోరిన్‌ ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్‌-నికోబార్‌ దీవులకు చేరుకున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండి) వెల్లడించింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని శుభవార్త అందించింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది.నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణ బంగాళాఖాతం అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ తెలిపారు. అంతేగాకుండా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు మధ్య ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం వుందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే, వచ్చే మూడు రోజలపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఎండ నిప్పుల వానలా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాలులు వీస్తాయని, 41 నుంచి 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావొద్దని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?