ఇక జోరు!

టిఆర్‌ఎస్‌లో స్తబ్ధతను తొలగించేందుకు కెసిఆర్‌ సమాయత్తం
మంత్రివర్గంపై ఊహాగానాలకు త్వరలోనే తెర
పది మందికిపైగానే కేబినెట్‌లో చోటు
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కొద్ది రోజుల్లో ప్రకటన

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న టిఆర్‌ఎస్‌ ఇక దూకుడు పెంచాలని భావిస్తున్నది. మంత్రివర్గ ఏర్పాటుపై రకరకాల ఉహాగానాలకు తెరదించాలని, అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది.మంత్రివర్గ ఏర్పాటుపై ప్రతిపక్షాల తీరుపై ఘాటుగానే స్పందించాలని, అలాగే మంత్రివర్గ ఏర్పాటుకు ఆలస్యానికి గల కారణాలను కూడా కెసిఆర్‌ స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడంతో పాలనలో కొంత లోటు కనిపించడం, ఫలితంగా పార్టీలో కాస్త స్తబ్ధత నెలకొనడం, ఇప్పట్లో పదవులు రావనే భావనతో పార్టీ శ్రేణు లు నైరాశ్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నా యి. పైగా త్వరలోనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌లో స్తబ్ధత నెలకొనడం మంచిది కాదని కూడా టిఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే త్వరలోనే స్తబ్ధతకు కెసిఆర్‌ తెర దించనున్నట్లు సమాచారం. శాఖల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కివచ్చింది. దీంతో ఇక ఏ శాఖలను ఎవరికి అప్పగించాలనే అంశంపై కూడా కెసిఆర్‌ ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే కొందరు తాజా మాజీ మంత్రులకు తిరిగి మంత్రి పదవులు దక్కె అవకాశాలు లేవని, ఇది వరకే సదరు మాజీలకు సంకేతాలు అందినట్లు పార్టీలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తొలుత ఆరు, ఆ తర్వాత ఎనిమిది మందికే మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు టిఆర్‌ఎస్‌ నేతల్లో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం తాజా రాజకీయపరిణామాల నేపథ్యంలో పది మందికి పైగానే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?