ఇంట్లోనే ఉందాం!

కరోనా వైరస్‌ను ఓడించేందుకు రోజంతా ‘సామాజిక దూరం’
నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్‌పై జనం వార్‌ ప్రకటించారు. రోజంతా ఇంట్లోనే వుండి కరోనాకే చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19)కు మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. అందుకే మన దేశంలోనూ విజృంభిస్తున్న కరోనాను నియంత్రించేందుకు 22వ తేదీ ఆదివారం నాడు ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించడానికి జనం యావత్తూ సమాయత్తమయ్యారు. 14 గంటలపాటు ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా వుండటమే ఈ జనతా కర్ఫ్యూ ఉద్దేశం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకడుగు ముందుకేసి 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని ప్రజలను కోరింది. అలాగే కరోనాపై పోరాడుతున్న వైద్యులకు సంఘీభావంగా సాయంత్రం 5 గంటలకు వరండాలోకి లేదా పోర్టిగోలోకి వచ్చిన చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చింది. ఇది జనం కోసం, జనం చేత, జనమే ఆలపించే నిశ్శబ్ధగీతం. అకుంఠిత దీక్షతో చర్యలు చేపడుతూ, సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనాపై విజయం సాధించిన చైనాను స్ఫూర్తిగా తీసుకొని శనివారంనాడు ప్రపంచంలోని దాదాపు 100కు పైగా దేశాల్లో సైతం జనతా కర్ఫ్యూను జయప్రదంగా నిర్వహించారు. భారత్‌లో కూడా ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇది మన కోసం… జనం కోసం… దేశం కోసం! రోజంతా ఇంట్లోనే ఉందాం! కరోనాను ఓడిద్దాం!

DO YOU LIKE THIS ARTICLE?