ఆ సమయంలో తప్పుకోవాలనుకున్నా

న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే అప్పటి వరకు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు సెమీఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో భారత సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌ మిథాలీ రాజ్‌ను పక్కన పెట్టడం పెద్ద వివాదంగా మారింది. ఒకేసారి హర్మన్‌పై విమర్శల వర్షం కురిసింది. ఈ సమయంలో తాను చాలా కలత చెందినట్లు భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. ప్రధానంగా మిథాలీ రాజ్‌ను తప్పించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటు బిసిసిఐ కూడా వివరణ కోరడం మనోవేదనకు గురి చేసిందని చెప్పింది. ఆ సమయంలో క్రికెట్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలని భావించానని పేర్కొంది. తన బాధను తల్లి దండ్రులు కూడా అర్థం చేసుకుని క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు.అయితే తాను ఒక సీనియర్‌ క్రీడాకారిణి కావడంతో జట్టుకు దూరం కావడానికి ఆలోచించాల్సి వచ్చిందని హర్మన్‌ చెప్పంది. తర్వాత కొద్ది రోజుల్లో ఆ వివాదం నుంచి బయటకు వచ్చేశాను. అప్పటి విషలన్నిటిని పూర్తిగా పక్కనపెట్టేసి క్రికెట్‌పై దృష్టి పెట్టానని హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?