ఆసీస్‌ మహిళలదే వన్డే సిరీస్‌

రెండో వన్డేలోనూ ఓడిన కివీస్‌
ఐసిసి మహిళల వన్డే చాంపియన్‌షిప్‌
ఆడిలైడ్‌: ఐసిసి మహిళల వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ మహిళలు 95 పరుగులతో న్యూజిలాండ్‌ మహిళలను చిత్తు చేశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్‌ హయ్‌నెస్‌ శుభారంభాన్ని అందించారు. వీరు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అనంతరం కుదురుగా ఆడుతున్న హయ్‌నెస్‌ (16) పరుగులు చేసి డేవిన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగింది. అనంతరం క్రీజులో ఆడుగుపెట్టిన ఆసీస్‌ సారథి మేగ్‌ లాన్నింగ్‌ (3) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరింది. దీంతో ఆసీస్‌ 50 పరుగుల వద్దే రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత హీలీ, ఎలీసె పెర్రీ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు మూడో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన అనంతరం కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న ఓపెనర్‌ హీలీ (46; 75 బంతుల్లో 7 ఫోర్లు) అన్న పీటర్సన్‌ బౌలింగ్‌లో ఆవుటైంది. తర్వాత పెర్రీ, బెత్‌ మూనీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. చివర్లో దూకుడుగా ఆడుతున్న మూనీ (42; 52 బంతుల్లో 3 ఫోర్లు)ని అమెలియా కేర్‌ తెలివైన బంతితో పెవిలియన్‌ బాట పట్టించింది. దీంతో 98 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు పెర్రీ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించింది. వరుస బౌండరీలతో కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే పెర్రీ తన కెరీర్‌ తొలి వన్డే శతకాన్ని నమోదు చేసుకుంది. కాగా, మరో ఎండ్‌ నుంచి ఇతర బ్యాట్స్‌వుమెన్స్‌ ఎవరూ కూడా భారీ స్కోరు చేయక పోవడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన పెర్రీ (107 నాటౌట్‌; 110 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయంగా నిలిచింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో అమెలియా కేర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అన్న పీటర్సన్‌ రెండు వికెట్లు తీసింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను ఆసీస్‌ బౌలర్‌ జెస్‌ జొనసేన్‌ హడలెత్తించింది. నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ బ్యాట్స్‌వుమెన్స్‌పై ఎదురుదాడికి దిగింది. ఈమె ధాటికి కివీస్‌ వరుసక్రమంలో వికెట్లు కోల్పోతూ చివరికి 38 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ సోఫీ డెవీన్‌ (47; 59 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ ఆమీ సాటెర్ట్‌వైట్‌ (37), హీలీ జెన్సెన్‌ (21) తప్ప మిగతా బ్యాట్స్‌వుమెన్స్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా కివీస్‌కు భారీ ఓటమితో పాటు సిరీస్‌ కూడా చేజారింది. ఆసీస్‌ బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేసిన జెస్‌ జొనసేన్‌ 8 ఓవర్లోల 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మరోవైపు మేగన్‌ స్చట్‌ రెండు వికెట్లు తీసి విజయంలో తన వంతు సహకారం అందించింది.

DO YOU LIKE THIS ARTICLE?