ఆశలేని బతుకు!

అగమ్య గోచరం… ఆశా వర్కర్ల జీవనం
రోజూ గొడ్డు చాకిరే…ఉద్యోగ భరోసాలేదు
జీతం చారెడు… విధులు బారెడు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌హెచ్‌ఎం (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌) కింద ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియామకం చేసింది. అచ్చ తెలుగులో వీరిని స్వచ్ఛం ద మహిళ ఆరోగ్య సేవాకురాలుగా కూడా పులుస్తారు. 1000 జనాభాకు ఒక ఆశ వర్కర్‌ను ప్రభుత్వం నియమించింది. వీరు నిత్యం గర్భం దాల్చిన మహిళలను గుర్తించి 2 నెలల లోపు వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి వారి కి పౌష్టికాహారం అందేలా సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. బిడ్డ ఎదుగుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా వారికి అవగాహన కల్పించడం, ప్రసవం గ్రామంలో కాకుండా ఆసుపత్రి లో ఆయ్యేలా చూడడం, టిబి నివారణకు రోగులను గుర్తించి అవసరమైన మందులను అందే లా, కుష్టు, క్యాన్సర్‌, మలేరియా (అసంక్రమిత వ్యాధులకు) రోగులకు చికిత్స అందేలా చూడ డం కూడా వీరి ప్రధాన విధులు. ఈ విధులను నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు గతంలో కేవలం ప్రభుత్వం రూ. 1000 పారితోషకాన్ని అందించేది. కానీ, కెసిఆర్‌ రెండవ సారి అధికారం చేపట్టిన తరువాత రూ. 7500లకు పెంచారు. అధికారులు విధించిన టార్గెట్‌ను రీచ్‌ అయితేనే ప్రభుత్వం మొత్తం వేతనాన్ని చెల్లిస్తుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1100 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే పూర్తి వేతనం అందుతున్న పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ప్రతి ఆశా వర్కర్‌ విధిగా నెలకు రెండు కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా నిబంధన పెట్టింది. ఒక్క నెలలో రెండు కేసులకుపైగా కాన్పులు అయినా మిగతా నెలలో ఒక్కటి కాకున్నా ఎక్కువ నెలల కాన్పులను రానీ నెలలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. వేతనంలో కోతలు విధిస్తున్నారు. విధులు బారెడు ఉన్నా జీతం మాత్రం చారెడే కావడంతో వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి.
ఉద్యోగ భరోసాలేదు
రోజు గొడ్డు చాకిరీ చేస్తున్న ఆశా వర్కర్లకు తమ బతుకుపై ఆశ లేకుండా పోయింది. ఉద్యోగ భరోసా కూడా లేదు. ఈ గడ్డు పరిస్థితుల్లో కూడా ఆశా వర్కర్లు మహిళా ఆరోగ్య సేవకులుగా తమ విధులను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యోగ సమయంలో వారికి ఇచ్చిన జాబ్‌చార్ట్‌లో పొందుపర్చిన పనులే కాకుండా అధికారులు అందులో లేని పనులకు కూడా వారితో చేయించుకుంటున్నారు. ప్రతి పనిలో వారే ముందుంటున్నారు. ఇటీవల యావత్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో కూడా అందరి కంటే ముందు వరుసలో ఆశాలే ఉంటున్నారు. వైరస్‌ నిర్ధారణ అయిన తరువాత ఆ వ్యక్తి నివాసముంటున్న ప్రాంతంలోకి వెళ్ళి ఇంటింటికీ సర్వేలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తున్నారు. కరోనా మహమ్మారి పేరు చెప్పగానే నేడు ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశా వర్కర్లు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజారోగ్యమే ధ్యేయంగా ముందు వరుసలో నిలబడుతున్నారు. వీరికి వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్‌ కట్టడికి కృషి చేస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బందికి, వైద్యులకు ప్రభుత్వం రూ. 50 లక్షల బీమా సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం వేతనం అందించడం జరిగింది. వీరితో పాటు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం పని చేస్తున్న ఆశాలకు బీమా సౌకర్యం కల్పించలేదు. వీరికి ఏప్రిల్‌, మే మాసాల్లో మాత్రమే అదనపు వేతనం అందింది. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్‌ కేసులు రోజురోజుకు నమోదవుతునే ఉన్నాయి. కానీ ప్రభుత్వం జూన్‌ మాసం నుండి అదనంగా ఇచ్చే 10 శాతం వేతనాన్ని కూడా నిలిపివేసింది. పాత నిబంధనల ప్రకారమే వేతనాలు చెల్లించడం జరుగుతుందంటూ అధికారులు ఉత్తర్వు జారీ చేశారు.
కరోనా సమయాన కన్నుమూస్తున్న ఆశా వర్కర్లు
జాబ్‌చార్ట్‌లో లేని విధులను కూడా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఇంటింటి సర్వేకు వెళ్ళిన వారికి వైరస్‌ బారిన పడే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగ భరోసా లేకున్నా పని చేస్తున్న ఆశాలకు నేడు బతుకుపై ఆశలేకుండా పోయింది. జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంకి చెందిన అనిరెడ్డి శోభారాణి అనారోగ్యానికి గురై మృత్యువాత పడింది. ప్రధానంగా పని ఒత్తిడే కారణమని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఆమె మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. అనేక మంది ఆశా వర్కర్లు కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు వారి బతుకుపై భరోసా కల్పించాలని వారి కుటుంబసభ్యులు, తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగ సంఘం(హెచ్‌-1) డిమాండ్‌ చేస్తున్నారు.
ఆశా వర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారని, ప్రభుత్వం ఆశాలను ఆదుకోవాలని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగ సంఘం(హెచ్‌-1) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్లు పడుతున్న ఇబ్బందులపై ఆయన ‘ప్రజాపక్షం’తో మాట్లాడుతూ ఆశా వర్కర్లకు శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదన్నారు. జాబ్‌చార్ట్‌లో లేని పనులను కూడా వారితో ప్రభుత్వం చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ 19తో జరుగుతున్న పోరాటంలో ముందు వరుసలో ఆశాలే ఉన్నారని చెప్పారు. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం కల్పించిన బీమాను వీరికి కూడా వర్తింపచేయాలన్నారు. టార్గెట్‌తో సంబంధం లేకుండా పూర్తి వేతనంతో పాటు అదనపు వేతనం కూడా అందించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?