ఆర్థిక, ఆహార భద్రతకుప్యాకేజీ ఇవ్వండి

ఆ తర్వాతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌  హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించాలనుకుంటే ముందు ప్రజలకు ఆహార, ఆర్థిక భద్రతకు సంబంధించిన ప్యాకేజీ ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మహా నగరమంతా లాక్‌డౌన్‌ అంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, కంటైన్‌మెంట్‌ జోన్‌లను ప్రకటించి అక్కడ కఠినంగా, ఇతర చోట్ల కొంత సడలింపుతో వ్యవహరించాలని సూచించారు. జూమ్‌ యాప్‌ ద్వారా బుధవారం నాడు చాడ వెంకట్‌రెడ్డి తన నివాసం నుండి మీడియా సమావేశం నిర్వహించారు. ఛాతి ఆసుపత్రిలో వెంటిలేటర్‌ పెట్టకపోవడంతో మరణించే ముందు రవికుమార్‌ పెట్టిన సెల్ఫీ వీడియోకు సంబంధించి మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించిన తీరును తప్పుబట్టారు. మరణించే ముందు కూడా ఎవరైనా అబద్ధాలు చెబుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా లోపాలను సరి చేసుకోవాలని, ముఖ్యమంత్రితో మాట్లాడి మంత్రి ఈటల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, పారామెడికల్‌ ఇబ్బంది ఖాళీలన్నీ భరీ చేయాలన్నారు. టిమ్స్‌ ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నియామకాలు జరగలేదన్నారు.
కరనా నియంత్రణలో పట్టింపేది?
కరోనా విషయంలో ప్రభుత్వం మరింత సీరియస్‌గా ఉండాలని చాడ వెంకట్‌రెడ్డి అన్నా రు. స్వయంగా తాను నివసించే అపార్ట్‌మెంట్‌లోనే క్రితం రోజు ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, శానిటైజేషన్‌ చేసేందుకు ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదన్నారు. నగరం నడిబొడ్డు ప్రాంతంలోనే పరిస్థితి ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు. స్వయంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులే హరితహారం కార్యక్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. నాలుగైదు రోజుల్లో హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పెడతామని ముఖ్యమంత్రి అన్నారని, ఒకవేళ పెట్టినా కఠినంగా అమలు చేయకపోతే ప్రయోజనం ఉండబోదన్నారు. ఇప్పటికే కోటికి పైగా జనాభా ఉన్న రాజధానిలో ప్రజలు భయాందోళనలో ఉన్నారని, మరోసారి 15 రోజుల లాక్‌డౌన్‌ పెడితే ఉపాధి విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందుకే తొలుత ప్రజలకు ప్యాకేజీ ప్రకటించాకే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పు చేసైనా సరే ప్రజలకు ఆర్థిక సాయం చేయాలని, తద్వారా భరోసా కల్పించాలని చెప్పారు. నగరమంతా లాక్‌డౌన్‌ కాకుండా పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించి కఠినంగా వ్యవహరించాలని, మిగతా చోట్ల కాస్త సడలింపులు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు క్యాబినెట్‌లో చర్చించాలని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంతకుముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
కొండపోచమ్మ కాలువ గండిపై విచారణ
కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుండి నీటిని తీసుకుపోయే కాలువకు బుంగపడిన ఘటనపై సీనియర్‌ ఐఎఎస్‌ అధికారితో విచారణ జరిపించాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా కట్టామని ప్రభుత్వం చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలకు అప్పుడే బుంగ పడడంతో పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇది ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ అని అన్నారు. బేస్‌మెంట్‌ సరిగా లేదని, కాంక్రీట్‌ నాణ్యత లేదన చెబుతున్నారని, దీనికి కాంట్రాక్టు ఏజెన్సీలదే బాధ్యత అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ అంతంతే
ప్రధాని నరేంద్రమోడీ నవంబర్‌ వరకు ఐదు కిలోల బియ్యం, కిలో పప్పు ఇస్తామని చేసిన ప్రకటన పేదలకు అంతంత మాత్రమే ప్రయోజనం కలుగుతుందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బియ్యం, పప్పులు ఇస్తే సరిపోతుందా? కూరగాయలు, నూనెలకు పేదలకు డబ్బులెలా వస్తాయని ప్రశ్నించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?