ఆర్థిక అసమానతలు ఆందోళనకరం

బిజెపి సర్కార్‌ పుణ్యమే
సామ్రాజ్యవాదుల ఏజెంట్‌ మోడీ
ఎఐటియుసి ప్రతినిధుల సభలో అమర్‌జిత్‌ కౌర్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కార్పొరేట్‌ శక్తులు, సామ్రాజ్యవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి) జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శించారు. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో దేశం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు, సంపన్నులకు, కార్పొరేట్‌ వర్గాలకు మేలు చేసే విధంగా అనుకూల ఆర్థిక విదానాలు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభల్లో భాగం గా సోమవారం రెండవ రోజు సామ భూపాల్‌ రెడ్డి గార్డెన్‌ (కె.ఎల్‌.ధర్‌ ప్రాంగణం) లో ప్రతినిధుల సభ జరిగింది. సభకు ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహన్‌ అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి వి.రత్నాకరరావు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు వి. చంద్రయ్య స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్‌జిత్‌ కౌర్‌ ప్రతినిధుల సభను ప్రారంభించి ప్రసంగిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుధ్ధంగా వ్యవహరిస్తోందని, అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు, సంస్కృతికి తిలోదకాలిచ్చి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం అంశాలను లేకుండా చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడితే సహించబోమని పదే పదే ప్రకటనలు చేస్తున్న మోడీ అవినీతిని పెంచి పోషిస్తున్నారని, ప్రధానమంత్రి కార్యాలయమే దళారీగా వ్యవహరిస్తూ అవినీతికి కేం ద్రంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యంతోనే జరిగిందని, ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలన్నారు. ప్రధాని మోడీ అంబానీ, ఆదానీ సేవలో పరితపిస్తున్నారని, గేల్‌ సంస్థను రిలయన్స్‌ సంస్థకు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. రైల్వే, కోల్‌ ఇండియా  వంటి ఇతర సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ అవినీతిని చట్టబద్ధం చేశారని అమరజిత్‌ విమర్శించారు. ఆదానీ, అంబానీ చేతుల్లో ఉన్న ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో ప్రధాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారం నమ్మవద్దని హితువు పలికారు. దేశంలో హిట్లర్‌, ముసోలిన్‌ నియంత, ఫాసిజం పాలన సాగుతోందన్నారు. కార్మిక వర్గంలో విశ్వాసం కల్గించే ఉద్యమాలు సాగించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్మిక ఉద్యమాలను మోడీ గుర్తించడం లేదన్నారు. అచ్ఛేదిన్‌ పెట్టుబడిదారులకే వచ్చాయని పేదలకు మాత్రం బురేదిన్‌ వచ్చాయన్నారు. గణాంకాలు దాచి పెడుతున్నారని దీనిని నిరసిస్తూ గణాంక విభాగానికి చెందిన ఇద్దరు సభ్యులు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 పనిదినాలు కల్పించాలని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలని డిమాండ్‌ చేశారు. సంఘ్‌ పరివార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుత్వ ఫాసిస్టు శక్తుల ఆగడాలు సృతిమించి పోయాయని, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌, లంకా గౌరీష్‌, కల్బుర్గి వంటి అభ్యుదయవాదులను హిందుత్వ శక్తులు మట్టుబెట్టాయని చెప్పారు. ఎర్రజెండా నీడలోనే కార్మిక వర్గానికి విముక్తి కల్గుతుందన్నారు. 80 ఏళ్ళ కాలంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ పాలనలో అసమానతలు పెచ్చుమీరాయని, అసమానతల వల్ల అశాంతి నెలకొని ఉద్యమాలు సాగుతాయన్నారు. బేటీ బచావో, బేటీ పడావో నినాదం ఒట్టి బూటకమని ఏద్దేవా చేశారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి దేశాల కంటే మన రూపాయి విలువ పడిపోతోందని, దీనికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని అన్నారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి సాయిబాబా సౌహార్థ సందేశం ఇస్తూ కార్మికులు విప్లవ ఐక్యతతో పోరాటాలను ఉధృతం చేయడం ద్వారానే పాలకుల మెడలు వంచుతామన్నారు. కార్మిక వర్గం రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న పాలక వర్గాలపై పోరు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరళీకరణ, ఆర్థిక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా, దూకుడుగా అమలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కృషిచేయలన్నారు. ఎపి, తెలంగాణ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు రవీంద్రనాత్‌ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకులను ధ్వంసం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేంద్రమంత్రులు, ఎంపిలు వివిధ బ్యాంకుల నుంచి రూ.15 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారని, ఒక్క రూపాయి అప్పుకూడా పుట్టడం లేదన్నారు. బ్యాంకులను మూసివేసే కుట్ర జరుగుతోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పనిదినాలు 200 రోజులు కల్పిం చి ప్రతి రోజు కూలి రూ.500 చెల్లించాలని, డిమాండ్‌ చేశారు. ఆలిండియా డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బి. చంద్రయ్య మాట్లాడుతూ కీలక రంగాల్లో ఒకటైన రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్నారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడమంటే దేశ భద్రతకే ప్రమాదకరమన్నారు. సభలో పాల్గొన్న అతిథులు అమర్‌జిత్‌ కౌర్‌, సాయిబాబా, నర్సింహన్‌, రత్నాకర్‌ రావు, రవీంద్ర నాథ్‌ లను మెమొంటోలతో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, కోశాధికారి సానుగంటి పర్వతాలు, బి.చంద్రయ్యలు సత్కరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బి.సీతారామయ్య, గంగాధర్‌రావు, ప్రేంపావని, కార్యదర్శులు విఎస్‌ బోస్‌, ఎన్‌.కరుణ కుమారి, కైలాస్‌, మల్లేష్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎస్‌. బాల్‌రాజ్‌, పోటు ప్రసాద్‌, ఎండి యూసుఫ్‌, శ్రీనివాస్‌, బి.వెంకటేశ్‌ ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసింహన్‌, రత్నాకర్‌రావులు రాష్ట్ర ఎఐటియుసి తరఫున కేంద్ర ఎఐటియుసికి రూ.2 లక్షల విరాళం చెక్కును అమర్‌జిత్‌ కౌర్‌కు అందజేశారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహన్‌ అరుణ పతాకాన్ని ఆవిష్కరించి అమర వీరుల స్థూపం వద్ద నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

DO YOU LIKE THIS ARTICLE?