ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి ఉందా?

దీనిపై రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలేంటి?
ప్రతి విద్యార్థి రూ. 20 వేల ఖర్చు భరించేదెలా?
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ప్రైవేటు పాఠశాలల ఆన్‌లైన్‌ తరగతుల గురించి ప్రభుత్వ అనుమతి ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చారు? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సాధారణ విద్యా సంవత్సరమయ్యే సమయమిదే, కాబట్టి ఆన్‌లైన్‌ పాఠాల ద్వారా విద్యా సంవత్సరం కొనసాగిస్తారా లేదా కొద్ది రోజుల తరువాత పాఠశాలలు ప్రారంభిస్తారా అనేది చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రం లో అనేక ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తున్నాయ ని, ఆన్‌లైన్‌ తరగతుల నిమి త్తం ప్రతి విద్యార్థి సెల్‌ఫోన్‌ లేదా లాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ కొనాల్సి వస్తున్నదని తెలిపారు. అలాగే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాల్సి వస్తున్నదని, దీంతో ప్రతి కుటుంబానికి రూ.20వేల వరకు ఖర్చవుతున్నదన్నారు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలల ప్రారంభంపై అనిశ్చితి నెలకొన్నదని పేర్కొన్నారు. విద్యా కోల్పోకుండా ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ కొంత వరకు మంచిదేనని, అయితే ప్రభుత్వం దానిపై ఒక విధానాన్ని ప్రకటించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ సదుపాయం లేని కారణంగా విద్యను దూరం చేసినట్లవుతుందని చాడ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో మిషన్‌ భగీరథ పథకంలో ఇంటింటికి నల్లాతో పాటు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కానీ, అది వాస్తవ రూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే అందరికీ ఉచితంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు సుముఖంగా ఉంటే విద్యార్థులకు టాబ్‌లెట్‌ వంటివి పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బియ్యం లేదా నగదు ఇవ్వాలి
పభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనందువలన పేద విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి మూలంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధి లేకపోవడంతో తిండి దొరకని పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలో వున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం నిర్వహించడం సాధ్యం కానప్పుడు వారికి బియ్యం, నిత్యావసర సరుకులు లేదా నగదును అందజేయడం సబబుగా ఉంటుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?