ఆదుకున్న అక్షయ్‌, సంజయ్‌

విదర్భ 245/6
రెస్టాఫ్‌ ఇండియాతో ఇరానీ కప్‌
నాగ్‌పూర్‌: రెస్టాప్‌ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌ క్రికెట్‌ టోర్నీలో విదర్భ ఎదురీదుతోంది. వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విదర్భ ఇరానీ కప్‌లో మాత్రం తడబడుతోంది. తొలి రోజు ఆటలో బౌలర్లు పర్వాలేదనిపించినా.. రెండో రోజు మాత్రం బ్యాట్స్‌మెన్స్‌ మెరుగ్గా రాణించలేక పోయారు. మంచి ఆరంభం లభించినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో విదర్భ కష్టాల్లో పడింది. బుధవారం రెండో రోజు ఆటలో రామస్వామి సంజయ్‌ రఘునాథ్‌ (65; 166 బంతుల్లో 9 ఫోర్లు), అక్షయ్‌ వాడ్కర్‌ (50 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. రెస్టాఫ్‌ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌, ధర్మేంద్ర సింగ్‌ జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రెస్టాఫ్‌ ఇండియాలో హనుమ విహారి (114), మయాంక్‌ అగర్వాల్‌ (95) చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. ప్రస్తుతం విదర్భ 85 పరుగులతో వెనుకబడి ఉంది. బుధవారం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విదర్భకు ఓపెనర్లు కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌, రామస్వామి శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే చక్కగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. వీరు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం కుదురుగా ఆడుతున్న కెప్టెన్‌ ఫజల్‌ (27; 65 బంతుల్లో 5 ఫోర్లు)ను గౌతమ్‌ పెవిలియన్‌ పంపాడు. తర్వాత వచ్చిన అతర్వ తైదెతో కలిసి రామస్వామి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ కుదురుగా ఆడుతూ తమ వికెట్‌లను కాపాడుకున్నారు. సింగిల్స్‌, డబుల్స్‌లతో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ పోయారు. దీంతో స్కోరుబోర్డు నత్త నడకన ముందుకు సాగింది. చివరికి వీరు రెండో వికెట్‌కు కీలకమైన 34 పరుగులు జోడించిన అనంతరం ఈ జోడీని రాహుల్‌ చాహర్‌ విడదీశాడు. దీంతో సమన్వయంగా ఆడుతున్న తైదె (15) పరుగులు చేసి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత గణేష్‌ సతీష్‌తో కలిసి సంజయ్‌ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ అవకాశం దొరికినప్పుడుల్లా బౌండరీలు కొడుతూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 38.4 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. మరోవైపు కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న సంజయ్‌ 137 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం రామస్వామి సంజయ్‌ (65) పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో విదర్భ 146 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. తర్వాత చెలరేగిన రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లు వరుసక్రమంలో వికెట్లు తీస్తు విదర్భను కట్టడి చేశారు. మరోవైపు కుదరుగా ఆడుతున్న గణేష్‌ సతీష్‌ (48; 105 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌)ను కూడా గణేష్‌ క్రీన్‌ బౌల్డ్‌గా పెవిలియన్‌ పంపాడు. కాలె (1) కూడా ఔటవ్వడంతో విదర్భ 22 పరుగుల వ్యవధిలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అక్షయ్‌ వాడ్కర్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో విదర్భను ఆదుకున్నాడు. సర్వతె (18)తో కలిసి ఆరో వికెట్‌కు 58 పరుగుల మరో కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చాడు. తర్వాత వచ్చిన అక్షయ్‌ కార్నెవర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అర్ధ శతకం సాధించిన అక్షయ్‌ వాడ్కర్‌ (50 బ్యాటింగ్‌; 96 బంతుల్లో 9 ఫోర్లు) అజేయంగా క్రీజులో ఉన్నాడు. మరోవైపు ధాటిగా ఆడిన అక్షయ్‌ కార్నెవర్‌ 15 బంతుల్లో మూడు ఫోర్లతో అజేయంగా 15 పరుగులు చేసి క్రీజులో నిలుచున్నాడు. దీంతో విదర్భ 90 ఓవర్లలో 245/6 పరుగులు చేసింది. రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌, ధర్మేంద్ర సింగ్‌ జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్‌ రాజ్‌పూత్‌, రాహుల్‌ చాహర్‌ తలొవికెట్‌ దక్కించుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?