ఆదాయంపై ఉన్న ఆసక్తి సహాయక చర్యలపై ఏదీ?

సడలింపులపై చాడ వెంకటరెడ్డి వ్యాఖ్య

ప్రజాపక్షం / హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కొన్ని చోట్ల కల్పించిన వెసులుబాట్లను గమనిస్తే పాలకులకు ఆదాయం మీద ఉన్నంత పట్టింపు సహాయక చర్యలు చేపట్టడంలో లేదనేది స్పష్టంగా కనబడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూనే కొంత వెసులుబాటులను జోన్ల వారీగా కల్పించిందని, రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల వారీగా గుర్తించిందని అన్నారు. అయితే ఆరెంజ్‌ జోన్లలో క్యాబ్‌లు, కార్లు, బైకులు తిరగడానికి అనుమతి ఇచ్చిందని, గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ పరిధిలో బస్సులు తిరగడాని కి అవకాశం కల్పించారని అన్నారు. వీటిని పరిశీలిస్తే ఆదాయాన్ని సమకూర్చే విషయంలో ప్రభుత్వాలు తహతహలాడుతున్నట్లు అర్థమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల బతుకులు అధోగతిగా ఉన్నాయని, అందులో భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, అసంఘటిత  కార్మికులు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు ఏవి చేపట్టలేదన్నారు. ప్రైవేట్‌ వైద్య, విద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నాలుగు నెలల నుండి జీతాలు లభించక తీవ్ర ఆవేదనతో ఉన్నారని చాడ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, వలస కార్మికులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల యాజమాన్యాలతో తక్షణమే చర్చలు జరిపి, ప్రభుత్వమే నేరుగా ఆదుకోవాలిలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?