ఆదర్శ మున్సిపాలిటీలో అంతా కంపే!

ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో : జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శ మున్సిపాలిటీగా పేరొందిన సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పుడు అంతా అవినీతి కంపే. అధికారులు, ఉద్యోగులు చెప్పేవి నీతులు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. చేతల కాడికి వచ్చేసరికి చెయ్యి తడపాల్సిందేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏలాంటి అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో జరిగే విక్రయాలను అడ్డుకొని మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచుకునేందుకు స్థ్ధానిక మున్సిపల్‌ అధికారులు దృష్టిసారించారు. దీనిలో భాగంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థలాల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్టేషన్లు చేయించుకునే వారు మున్సిపల్‌ కార్యాలయం నుంచి విధిగా విఎల్‌టి సర్టిఫికెట్‌ను పొందాకే రిజిస్టేషన్లు చేయించుకునేలా నిబంధనలు తెచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా విఎల్‌టి సర్టిఫికెట్‌ను మున్సిపాలిటీ ద్వారా పొందిన వారివే రిజిస్టేషన్‌ చేయాలని స్థాని క సబ్‌ రిజిస్ట్రార్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ నూతన నిబంధనతో ఉద్యోగులు భారీ దోపిడీకి తెరదీశారు. విఎల్‌టి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికెట్‌ జారీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫికెట్‌ కోసం కార్యాలయానికి వెళ్లేవారిని కొందరు ఉద్యోగులు డబ్బుల కోసం పీడిస్తున్నారన్న మాటలు వినవస్తున్నాయి. ఆ నోట, ఈ నోట పడి చివరకు మీడియా దృష్టికి రాగా అధికారులను ఈ విషయమై ప్రశ్నించిగా అలాంటి ఏమి లేదు… ఎవరో మాటలతో చెబితే చెల్లదు… రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నట్టు తెలిసింది. దీనిపై ‘ప్రజాపక్షం’ ప్రత్యేక కథనం సూర్యాపేట పట్టణంలో గత కొన్నేండ్లుగా అనేక మంది రియల్‌ వ్యాపారులు ఏలాంటి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున స్థలాల విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. దీనిని గుర్తించిన అధికారులు అక్రమ వ్యాపారాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. గత కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఈ దందాకు అడ్డుకట్టవేసేందుకు శ్రీకా రం చుట్టారు. మున్సిపాలిటీ నుండి విఎల్‌టి సర్టిఫికెట్‌ పొందిన తరువాతనే ఎవరైన రిజిస్టేషన్‌ చేయించుకోవాలని ప్రకటన చేశారు. స్ధానిక సబ్‌ రిజిస్ట్రార్‌కు కూడా స్ప ష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులు అధికారు లు దానిని అమలు పరుస్తూ వచ్చారు. మధ్యలో బ్రేక్‌ పడింది. నూతనంగా జిల్లా కలెక్టర్‌గా పదవి భాద్యతలు చేపట్టిన వినయ్‌క్రిష్ణారెడ్డి ఇటీవల పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్టేషన్‌ వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌ మల్లిఖార్జున్‌ను అడిగి తెలుసుకొని రికార్డులను తనిఖీ చేశారు. మున్సిపాలిటీ నుండి విఎల్‌టి సర్టిఫికెట్‌ పొందిన వారే రిజిస్టేషన్లు చేయాలంటూ ఆదేశించారు. దీంతో ఆరోజు నుండి విఎల్‌టి సర్టిఫికెట్‌ లేకుండా రిజిస్టేషన్లు జరగడం లేదు. రిజిస్టేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లగానే మున్సిపాలిటీ నుండి విఎల్‌టి సర్టిఫికెట్‌ తెస్తేనే రిజిస్టేషన్‌ చేస్తామని తేగేసి చెప్పడంతో స్ధలాల యజమానులు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. సర్టిఫికెట్‌ సకాలంలో అందక రిజిస్టేషన్‌ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో ప్రతి రోజు పట్టణ పరిధిలో ఖాళీ స్థలాలు 50 నుండి 60 రిజిస్టేషన్లు కాగా విఎల్‌టి సర్టిఫికెట్‌ పుణ్యమా అని కేవలం 3 నుండి 5వరకే రిజిస్టేషన్లు అవుతున్న పరిస్ధితి. సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుండి సర్టిఫికెట్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అధికారులు దానికి రెండు రెట్లు అదనంగా ఇస్తే తప్ప సర్టిఫికెట్‌ ఇవ్వని పరిస్ధితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల పట్టణంలోని 213 స్కేర్‌ మీటర్ల స్థలానికి సంబందించి దాని యజమాన్ని ఇతరులకు విక్రయించగా వారి కి రిజిస్టేషన్‌ చేసేందుకు స్ధానిక మున్సిపాలిటీలో విఎల్‌టి సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రోజుల తరబడి సర్టిఫికెట్‌ కోసం కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు. చివరకు అధికారులు సర్టిఫికెట్‌ను జారీ చేసి విఎల్‌టి, టాక్సి కింద మొత్తం రూ 1150 రుసుము వేశారు. సర్టిఫికెట్‌లో ఉన్న రుసుముని తీసుకోవాల్సిన ఉద్యోగులు యజమాని నుండి అదనంగా మరికొంత సొమ్ము వసూలు చేసినట్టు తెలిసింది. ఇదేమని ప్రశ్నిస్తే ఇంకా నాలుగురోజులైన తరువాత రాపో అప్పుడే సర్టిఫికెట్‌ ఇస్తామంటూ దబాయింపులకు పాల్పడట్లు సదరు యజమాని మీడియా ముందు వాపోయ్యా డు. మీడి యా దృష్టికి స్థల యజమానులు జరుగుతున్న దోపిడీ తేగా ఇదే విషయమై మున్సిపల్‌ కమీషనర్‌ రామాంజులరెడ్డిని వివరణ కోరగా.. నోటి మాట కుదరదని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెచ్చురిల్లిపోతుందని రెవెన్యూ శాఖ ఇందులో ప్రధమ స్ధానంలో ఉండగా రెండవ స్ధానంలో మున్సిపల్‌ ఉందని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?